సెల్ఫ్ డ్రైవింగ్ ఓలీలో జాలీగా...
3డీ ప్రింటెడ్ సెల్ఫ్ డ్రైవింగ్ మినీ బస్ "ఓలీ"ని లోకల్ మోటార్స్ ఆదివారం ఆవిష్కరించింది. 12 సీట్ల సామర్థ్యంతో ఆవిష్కరించిన ఈ బస్ ఐబీఎమ్ వాట్సన్ కాగ్నిటివ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ తో రూపొందిన మొదటి వాహనం. అరిజొనాకు చెందిన స్టార్టప్ లోకల్ మోటార్స్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు జాన్ బి. రోగర్స్ ఈ బస్ ను అమెరికా రాజధాని వాషింగ్టన్ సిటీల్లో ప్రవేశపెట్టారు. టెక్ పార్టనర్ గా ఐబీఎమ్ ఈ సంస్థకు సహకరించింది. 30 పైగా సెన్సార్లను ఈ వెహికిల్ లో పొందుపరిచారు. దీంతో ప్యాసెంజర్లతో ఓలీ కమ్యూనికేట్ అయ్యేలా ఇది ఓ ప్లాట్ ఫామ్ లా ఉపయోగపడనుంది.
ప్రయాణికుల ఎక్కిన దగ్గర్నుంచి గమ్యస్థానాల్లో దిగే వరకు ఓలీతో సంప్రదింపులు జరుపుతుండొచ్చు. ప్యాసెంజర్లు ఎక్కినప్పటి నుంచి అడిగే ప్రశ్నలకు ఓలీ స్పందన ఇచ్చేలా ఈ వాట్సన్ టెక్నాలజీ ఉపయోగపడనుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలతో స్థానిక గమ్యస్థానాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు, చారిత్రాత్మక ప్రదేశాల గురించి ప్యాసెంజర్లు ఓలీకి ప్రతిపాదించవచ్చు. స్మార్ట్, సురక్షితమైన, సుస్థిరమైన ప్రయాణాన్ని ఓలీ ఆఫర్ చేస్తుందని లోకల్ మోటార్స్ సీఈవో రోగర్స్ తెలిపారు. ఇక కంపెనీ నుంచి రూపొందే అన్ని వాహనాలకు ఈ వాట్సన్ టెక్నాలజీతోనే తీసుకొస్తామని రోగర్స్ పేర్కొన్నారు.