
తీవ్ర హెచ్చుతగ్గులు..
♦ చివరకు ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
♦ ప్రతికూల ప్రపంచ ట్రెండ్; మరోవైపు ఫలితాల సెగ
ముంబై: ప్రపంచ మార్కెట్లు తగ్గడం, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించడం వంటి అంశాలతో శుక్రవారం స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. చివరకు ఫార్మా, పవర్, పీఎస్‌యూ షేర్ల దన్నుతో సూచీలు ఫ్లాట్‌గా ముగియగలిగాయి. 25,755 పాయింట్లు, 25,424 పాయింట్ల మధ్య 330 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 3.52 పాయింట్ల స్వల్పలాభంతో 25,607 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మూడు వారాల్లో సెన్సెక్స్ నష్టపోయిన వారం ఇదే. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 7,889-7,788 పాయింట్ల మధ్య ఊగిసలాడి, చివరకు 2.55 పాయింట్ల లాభంతో 7,850 పాయింట్ల వద్ద ముగిసింది.
ఫలితాల ప్రభావం..: పెద్ద ఎత్తున మొండి బకాయిలకు కేటాయింపులు జరపడంతో లాభం బాగా పడిపోయినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించగానే బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అయితే మే నెల డెరివేటివ్ సిరీస్‌కు కొన్ని ఎంపికచేసిన షేర్లలో ఇన్వెస్టర్లు తాజా పొజిషన్లకు శ్రీకారం చుట్టారని, దాంతో బ్యాంకింగ్ షేర్లతో పాటు సూచీలు కూడా కోలుకున్నాయని ట్రేడర్లు చెప్పారు. గత రాత్రి అమెరికా స్టాక్ సూచీలు 1% మేర క్షీణించిన ప్రభావంతో శుక్రవారం ప్రధాన ఆసియా సూచీలు 0.25-1.5% మధ్య తగ్గాయి.