మూడు రోజుల లాభాలకు బ్రేక్
* 58 పాయింట్ల నష్టంతో 27,307కు సెన్సెక్స్
* 13 పాయింట్ల నష్టంతో 8,262కు నిఫ్టీ
వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్ల లాభాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 58 పాయింట్లు నష్టపోయి 27,307 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 13 పాయింట్లు నష్టంతో 8,262 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆద్యంతం ఊగిసలాటకు గురైన ట్రేడింగ్‌లో లోహ, ఆయిల్, గ్యాస్, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం.. ఈ అంశాలు ప్రభావం చూపాయి. రూ.250 కోట్లు తగ్గిన ఇండిగో ఐపీఓ సైజు
ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబల్ ఏవియేషన్ తన ఐపీఓ సైజును తగ్గించింది. ఈ కంపెనీ ముగ్గురు ప్రమోటర్లు గతంలో అనుకున్నదానికంటే తక్కువగా తమ వాటా షేర్లను విక్రయించాలని నిర్ణయించుకోవడంతో ఐపీఓ సైజు రూ.3268 కోట్ల నుంచి రూ.3,018 కోట్లకు తగ్గింది. ఈ నెల 27 ప్రారంభం కానున్న ఇండిగో ఐపీఓ ఇదే నెల 29న ముగియనున్నది.