న్యూయార్క్: భారత్‌లో స్టార్‌బక్స్‌కు బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుందని స్టార్‌బక్స్ సీఈవో హోవార్డ్ షుల్జ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 25 కాఫీ స్టోర్లే ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులోనే వేలాది అవుట్‌లెట్స్‌ను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఉత్తర అమెరికా తర్వాత తమకు ఉండే అతి పెద్ద రెండు మార్కెట్లలో భారత్ కూడా ఒకటి కానున్నదని ఆయన చెప్పారు. మరొక దేశం చైనా అని పేర్కొన్నారు. అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ రూపొందించిన రిఇమాజినింగ్ ఇండియా: అన్‌లాకింగ్ ద పొటెన్షియల్ ఆప్ ఏషియాస్ నెక్స్‌ట్ సూపర్‌పవర్ అనే పుస్తకానికి రాసిన ఒక వ్యాసంలో ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ పుస్తకంలో మొత్తం 60 వ్యాసాలున్నాయి. లబ్దప్రతిష్టులైన దిగ్గజ కంపెనీల సీఈవోలు, విద్యావేత్తలు, చరిత్రకారులు ఈ వ్యాసాలను రాశారు. విప్రో ప్రేమ్‌జీ, మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్, చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తదితరులు వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.స్టార్‌బక్స్‌కు భారత పెద్ద మార్కెట్ కాబోతోందని హోవార్డ్ షుల్జ్ అంచనా వేస్తున్నారు. అయితే భారత్‌లో ఈ లక్ష్యాలు సాధించడం అంత సులభమేమీ కాదని కూడా ఆయన అంగీకరించారు. భారత మార్కెట్లోకి ప్రవేశించడానికే తమకు ఆరేళ్లు పట్టిందని వివరించారు.