స్టాక్ మార్కెట్‌పై కొత్త ఏడాది తొలి వారంలో తయారీ, సేవల రంగానికి చెందిన పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు, వాహన విక్రయ వివరాలు ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, వీటితో పాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కూడా ఇన్వెస్టర్లు గమనిస్తారని నిపుణులంటున్నారు.
రేపు ‘తయారీ’ పీఎంఐ గణాంకాలు
రేపు(ఈ నెల 2 మంగళవారం) మార్కెట్ ఎకనామిక్స్ సంంస్థ భారత తయారీ రంగానికి సంబంధించి గత నెల పీఎంఐ గణాంకాలను విడుదల చేస్తుంది. అక్టోబర్‌లో 50.3గా ఉన్న ఈ పీఎంఐ గత ఏడాది నవంబర్లో 52.6కు పెరిగింది. ఈ నెల 4వ తేదీ(గురువారం) మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ భారత సేవల రంగానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ పీఎంఐ గణాంకాలను ఉదయం గం.10.30కు వెల్లడిస్తుంది. గత ఏడాది అక్టోబర్‌లో 51.7గా ఉన్న ఈ పీఎంఐ గత ఏడాది నవంబర్లో 48.5కు తగ్గింది.
వేల్యూయేషన్లు కొనసాగుతాయ్..!
ముడిచమురు ధరల గమనం స్టాక్ సూచీలపై ప్రభావం చూపుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. స్టాక్‌మార్కెట్ సానుకూల ఫండమెంటల్స్ కారణంగా వేల్యూయేషన్లు కొనసాగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. కంపెనీల ఎర్నింగ్స్ ఏమైనా వృద్ధి చెందుతాయోమోనన్న ఆశతో ఇన్వెస్టర్లు క్యూ3 ఫలితాల కోసం చూస్తున్నారని తెలిపారు.
రానున్న కేంద్ర బడ్జెట్, ప్రభుత్వ సంస్కరణలు.. రంగాల వారీ షేర్ల వైపు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తాయని వివరించారు. కంపెనీల ఉత్పత్తి సామర్థ్య పెంపు యత్నాలు, మూలధన పెట్టుబడుల్లో రికవరీ పుంజుకుంటే,... మార్కెట్ ముందుకే సాగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదికి కంపెనీల క్యూ3 ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ చెప్పారు. ఇక అందరి కళ్లు బడ్జెట్‌పై ఉంటాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకే ఈ బడ్జెట్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న అంచనాలున్నాయని యాక్సిస్ సెక్యూరిటీస్ సీఈఓ అరుణ్ తుక్రల్ చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అశాంతిని తొలగించే మంచి అవకాశం ఇప్పుడు ప్రభుత్వానికి దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అంతర్జాతీయ పరంగా చూస్తే, చైనా, యూరోజోన్, అమెరికా తయారీ రంగ గణాంకాలు రేపు(మంగళవారం, జనవరి 2న) వస్తాయి. ఈ ప్రాంతాల సేవల రంగ గణాంకాలు గురువారం(జనవరి 4న) వస్తాయి. డిసెంబర్‌లో జరిగిన ఫెడ్ మినట్స్ బుధవారం(ఈ నెల 3న) వస్తాయి. కాగా గత ఏడాది సెన్సెక్స్ 28 శాతం, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 శాతం చొప్పున లాభపడ్డాయి. గత మూడేళ్లలో స్టాక్ మార్కెట్‌కు ఇదే మంచి పనితీరు.
విదేశీ ఈక్విటీ పెట్టుబడులు రూ.51 వేల కోట్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ) గత నెలలో రూ.5,883 కోట్ల విలువైన పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. రూ.2,350 కోట్ల మేర డెట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, ద్రవ్యలోటు మరింతగా విస్తరిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారని నిపుణులు పేర్కొన్నారు.
కాగా గత ఏడాది(2017)లో విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో నికరంగా రూ.51,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ ఏడాది ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు రాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. లిక్విడిటీ తగ్గుతుండటం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వడ్డీరేట్లు పెరుగుతుండడమే దీనికి ప్రధాన కారణాలని వారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment