స్టాక్స్‌ వ్యూ | Stocks view | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Nov 12 2018 2:01 AM | Last Updated on Mon, Nov 12 2018 2:01 AM

Stocks view - Sakshi

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: కేఆర్‌ చోక్సీ
ప్రస్తుత ధర: రూ. 1,138        టార్గెట్‌ ధర: రూ.1,461  

ఎందుకంటే: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. రుణాలు 21 శాతం వృద్ధితో రూ.1,849 కోట్లకు పెరిగాయి. రిటైల్‌రుణాలు 28 శాతం, కార్పొరేటర్‌ రుణాలు 17 శాతం పెరగడమే దీనికి ప్రధాన కారణం. నికర వడ్డీ ఆదాయం 16 శాతం (క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 4 శాతం) వృద్ధితో రూ.2,690 కోట్లకు పెరిగింది. నిధుల వ్యయం 16 బేసిస్‌ పాయింట్లు పెరగడంతో నికర వడ్డీ మార్జిన్‌ 10 బేసిస్‌ పాయింట్లు తగ్గి 4.2 శాతానికి చేరింది. ఫీజు ఆదాయం 26 శాతం ఎగసి రూ.1,020 కోట్లకు పెరిగింది. కేటాయింపులు 63 శాతం పెరిగి రూ.350 కోట్లకు చేరాయి.

సీక్వెన్షియల్‌గా చూస్తే కేటాయింపులు 25 శాతం తగ్గాయి. ఇక నికర లాభం 15 శాతం(క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 11 శాతం) వృద్ధితో రూ.1,140 కోట్లకు పెరిగింది.  రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 11.6 శాతంగా ఉంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, స్థూల మొండి బకాయిలు 2 బేసిస్‌ పాయింట్లు తగ్గి 2.15 శాతంగా (రూ.4,030 కోట్లుగా) నికర మొండి బకాయిలు ఫ్లాట్‌గా 0.86 శాతంగా (రూ.1,500 కోట్లుగా)ఉన్నాయి. రుణ నాణ్యత అత్యుత్తమంగా ఉన్న బ్యాంక్‌ల్లో ఇది కూడా ఒకటి. గత రెండేళ్లుగా బ్యాంక్‌ లాభదాయకత పెరుగుతోంది. మరోవైపు ఒత్తిడి రుణాలు తగ్గుతున్నాయి. రుణ వృద్ధి 20 శాతానికి మించి ఉండగలదని బ్యాంక్‌ అంచనా వేస్తోంది.

ఇటీవలనే ఈ బ్యాంక్‌ వినియోగ వస్తువులు, టూ వీలర్ల కొనుగోళ్లకు రుణాలందించడం ప్రారంభించింది. లిక్విడిటీ సమస్యలతో సతమతమవుతున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల పోర్ట్‌ఫోలియోలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  కోటక్‌ 811 (డిజిటల్‌ బ్యాంక్‌ ఖాతా)కు మంచి స్పందన లభిస్తోంది. అనుబంధ సంస్థలు–కోటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్, కోటక్‌ సెక్యూరిటీస్, కోటక్‌ ప్రైమ్‌(కార్‌ ఫైనాన్సింగ్‌), కోటక్‌ ఏఎమ్‌సీల పనితీరు కూడా బావుంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రుణాలు 25 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం.


ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.437        టార్గెట్‌ ధర: రూ.515
ఎందుకంటే:
ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారం జోరుగా ఉన్నా, మార్జిన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. స్థూల మొండి బకాయిలు 10 శాతం పెరగడం(సీక్వెన్షియల్‌గా)నిరాశపరిచింది. సీక్వెన్షియల్‌గా వ్యక్తిగత రుణాలు 30 శాతం, ప్రాజెక్ట్‌ రుణాలు మూడు రెట్లు పెరిగాయి. మొత్తం మీద రుణ వృద్ధి 16 శాతంగా ఉంది. ఇది ఇటీవల కాలంలో ఇదే అత్యధిక త్రైమాసిక వృద్ధి. అధిక రాబడులు వచ్చే ఆస్తులు తనఖాగా రుణాలు, ప్రాజెక్ట్‌ రుణాలు పెరిగినప్పటికీ, నిధుల వ్యయం తగ్గినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్‌ మెప్పించలేకపోయింది.

ఈ క్యూ2లో నిధుల వ్యయం 8.3 శాతంగా ఉండటంతో నికర వడ్డీ మార్జిన్‌ 2.34 శాతంగా నమోదైంది. ఆస్తులు తనఖాగా రుణాలు 41 శాతం, ప్రాజెక్ట్‌ రుణాలు 83 శాతం పెరగడంతో నిర్వహణ ఆస్తులు 16 శాతం పెరిగాయి. రెండేళ్లలో నిర్వహణ ఆస్తులు 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. కేటాయింపులు సీక్వెన్షియల్‌గా 36 శాతం వృద్ధితో రూ.221 కోట్లకు పెరిగాయి. దీంతో ప్రొవిజనల్‌ కవరేజ్‌ రేషియో 20 శాతం పెరిగి 52 శాతానికి ఎగసింది.

బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మాతృసంస్థ కావడం, విస్తృతమైన నెట్‌వర్క్,  మార్జిన్లు కొనసాగించే సత్తా ఉండడం, రుణ నాణ్యత మెరుగుపడే అవకాశాలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. లిక్విడిటీ సమస్యలు కారణంగా నిధులు వ్యయం పెరిగే అవకాశాలుండటం, ఫలితంగా మార్జిన్లపై ఒత్తిడి పడనుండటం, స్థూల మొండి బకాయిలు పెరుగుతుండటం ప్రతికూలాంశాలు.


గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement