కోవిడ్‌-19 దెబ్బ- చౌకగా మారిన షేర్లు | Stocks in cheap valuations due to Covid-19 | Sakshi
Sakshi News home page

కోవిడ్‌-19 దెబ్బ- చౌకగా మారిన షేర్లు

Published Fri, May 29 2020 3:04 PM | Last Updated on Fri, May 29 2020 3:04 PM

Stocks in cheap valuations due to Covid-19 - Sakshi

ప్రపంచ దేశాలతోపాటు దేశీయంగానూ కరోనా వైరస్‌ విస్తరించడంతో పలు రంగాలు కుదేలయ్యాయి. కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డవున్‌ విధించడంతో ఆర్థిక వ్యవస్థ మందగమన బాటపట్టింది. పలు బిజినెస్‌లకు డిమాండ్‌ పడిపోవడంతోపాటు.. ఉత్పత్తి, సరఫరా సమస్యలు తలెత్తాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతకు తెరలేచింది. ప్రపంచ దేశాలన్నీ లాక్‌డవును అనుసరించడంతో దేశాల మధ్య ప్రయాణాలు రద్దయ్యాయి. వెరసి అటు టూరిజం, హోటళ్లు, విమానయానంతోపాటు.. ఇటు మల్టీప్లెక్స్‌లు, ఫ్యాషన్‌ రిటైలింగ్‌ తదితర రంగాలలో కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. దీంతో మార్చిలో ప్రపంచ మార్కెట్ల బాటలో దేశీ మార్కెట్లు సైతం కుప్పకూలినప్పటికీ తదుపరి ఏప్రిల్‌లో బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. అయినప్పటికీ పలు రంగాలకు చెందిన కౌంటర్లు ఇప్పటికీ ఏడాది గరిష్టాలతో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్నాయి. మారిన పరిస్థితులలో ఇటీవల ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు డిమాండ్‌ పెరుగుతూ వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రుణ చెల్లింపుల వాయిదాలపై ఆర్‌బీఐ మారటోరియం విధించినప్పటికీ ఆర్థిక మందగమనం కారణంగా కొంతమేర ఎస్‌ఎంఈ, కార్పొరేట్‌ తదితర రుణాల నాణ్యత దెబ్బతినే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్‌ రంగ కౌంటర్లు సైతం బలహీనంగా కదులుతున్నట్లు తెలియజేశారు. వివరాలు  చూద్దాం..

20-50 శాతం డౌన్‌
లాక్‌డవున్‌ ప్రకటించిన మార్చి 24 నుంచి బీఎస్‌ఈ-500లోని పలు కంపెనీలు 20-50 శాతం మధ్య పతనమయ్యాయి. జాబితాలో పలు రంగాలు, కంపెనీలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా కొన్ని కౌంటర్లను పరిశీలిస్తే.. చాలెట్‌ హోటల్స్‌ 49 శాతం పతనమైంది. ఏడాది కాలంలో 71 శాతం కుప్పకూలింది. కంపెనీ ఆదాయంలో సగ భాగం విదేశీ టూరిస్టుల నుంచే సమకూరుతుందని విశ్లేషకులు తెలియజేశారు. ఇక లెమన్‌ ట్రీ హోటల్స్‌ గత రెండు నెలల్లో 33 శాతం క్షీణించగా.. గరిష్టం నుంచి 74 శాతం పడిపోయింది. ఇతర కౌంటర్లలో మల్టీప్లెక్స్‌ కంపెనీ పీవీఆర్‌ షేరు 38 శాతం నీరసించగా.. గరిష్టం నుంచి 71 శాతం తిరోగమించింది. మాల్స్‌పై లాక్‌డవున్‌ కొనసాగుతుండటం, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ పుంజుకోవడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

ఫైనాన్స్‌ వీక్‌
కోవిడ్‌-19 ధాటికి ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లూ బలహీనపడ్డాయి. ఇటీవల కొంతమేర రికవర్‌ అయినప్పటికీ.. పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్‌, ఎన్‌బీఎఫ్‌సీ కంఔటర్లు డీలాపడ్డాయి. పీఎన్‌బీ, ఆర్‌బీఎల్‌, డీసీబీ, బీవోబీలతోపాటు..  చోళమండలం ఫైనాన్షియల్‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌, రెప్కో హోమ్‌ తదితరాలు గత రెండు నెలల్లో 22-33 శాతం మధ్య క్షీణించాయి. పెట్టుబడుల ఆవశ్యకత, మొండిబకాయిలు పెరగనున్న అంచనాలు ఇందుకు కారణంకాగా.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, షాపర్స్‌ స్టాప్‌ సైతం 30-34 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement