పీవీఆర్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.1,297 టార్గెట్ ధర: రూ.1,650
ఎందుకంటే: మల్టీ ప్లెక్స్ స్క్రీన్ల కంపెనీ, పీవీఆర్.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. మూవీ ఎగ్జిబిషన్ వ్యాపారం మంచి వృద్ధి సాధించడంతో ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.650 కోట్లకు పెరిగింది. ఇబిటా 21 శాతం పెరిగి రూ.110 కోట్లకు, ఇబిటా మార్జిన్ 0.6 శాతం వృద్ధితో 16.9 శాతానికి పెరిగాయి. కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే, ఆదాయం 28 శాతం వృద్ధితో రూ.710 కోట్లకు, ఇబిటా 37 శాతం వృద్ధితో రూ.120 కోట్లకు, మార్జిన్ 1.2 శాతం వృద్ధితో 17.5 శాతానికి ఎగిశాయి. నికర లాభం 30 శాతం వృద్ధితో రూ.33 కోట్లకు పెరిగింది.
నికర బాక్స్ ఆఫీస్ ఆదాయం 17 శాతం పెరిగి రూ.350 కోట్లకు, ఫుడ్, బేవరేజేస్ విభాగం ఆదాయం 25 శాతం పెరిగి రూ.180 కోట్లకు పెరిగాయి. ఇక ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆదాయం 18 శాతం, ఇబిటా 29 శాతం, నికర లాభం 22 శాతం, పెరగ్గా ఇబిటా మార్జిన్ 1.6 శాతం పెరిగి 18.6 శాతానికి పెరిగింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన ఆరు నెలల కాలంలో ఆదాయం 38 శాతం, ఇబిటా 51 శాతం, నికర లాభం 91 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం.
అలాగే రెండేళ్లలో ఇబిటా 30 శాతం, నికర లాభం 36 శాతం, ఆదాయం 23 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.400–450 కోట్ల మూలధన పెట్టుబడుల ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదు. ఎస్‌పీఐ సినిమాస్ పూర్తి టేకోవర్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పూర్తి కానుండటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 90, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 100 కొత్త స్క్రీన్లు జత కానుండటం, ప్రకటనల ఆదాయం పెరుగుతుండటం, చిన్న నగరాల్లో తక్కువ వ్యయ విధానంతో కూడిన సినిమా ఫార్మాట్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి తేనుండటం... ఇవన్నీ సానుకూలాంశాలు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్
ప్రస్తుత ధర: రూ. 1,159 టార్గెట్ ధర: రూ.1,400
ఎందుకంటే: కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ బ్యాంక్ నిర్వహణ పనితీరు నిలకడగా కొనసాగుతోంది. రుణ వృద్ధి 21% పెరిగి రూ.1,84 లక్షల కోట్లకు చేరడంతో నికర వడ్డీ ఆదాయం 16% పెరిగి రూ.2,689 కోట్లకు పెరిగింది. నికరవడ్డీ మార్జిన్ సీక్వెన్షియల్‌గా చూస్తే, 0.1% తగ్గి 4.2%కి తగ్గింది. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయాలు మంచి వృద్ధి సాధించడంతో కేటాయింపులకు ముందు నికరలాభం రూ.2,095 కోట్లకు చేరింది. కేటాయింపులు రూ.354 కోట్లకు పెరిగాయి.
రుణ నాణ్యత పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 2.15% నిలకడగా ఉండగా, నికర మొండి బకాయిలు స్వల్పంగా తగ్గి 0.81%కి చేరాయి. వాణిజ్య వాహన రుణాలు 40%, గృహ రుణాలు 39%, చిన్న వాణిజ్య సంస్థలకు రుణాలు 23% చొప్పున పెరగడంతో బ్యాంక్ మొత్తం రుణాలు 21%కి పెరిగాయి. డిపాజిట్లు 24% పెరిగి రూ.2 లక్షల కోట్లకు చేరాయి. మార్జిన్‌లు అధికంగా ఉండే రిటైల్ రుణాలు ఈ బ్యాంక్ మొత్తం రుణాల్లో సగం వరకూ ఉండటంతో బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ నికరవడ్డీ మార్జిన్, 4.5–4.9% రేంజ్‌లో ఈ బ్యాంక్ కొనసాగిస్తోంది.
రెండేళ్లలో డిపాజిట్లు 21% చక్రగతి వృద్ధితో రూ.2.80 లక్షలకోట్లకు, నికర లాభం 23% చక్రగతి వృద్దితో రూ.6,182 కోట్లకు పెరగగలవని అంచనా. పటిష్ట యాజమాన్యం, రుణ నాణ్యత నిలకడ, రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 1.7%గా, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 12–14% రేంజ్‌లో ఉండటం, బ్యాంక్ అనుబంధ సంస్థలు–కోటక్ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా ఓల్డ్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్, కోటక్ మహీంద్రా క్యాపిటల్‌ల పనితీరు పటిష్టంగా ఉండటం... ఇవన్నీ సానుకూలాంశాలు.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment