యస్ బ్యాంక్: కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ. 724
టార్గెట్ ధర: రూ.805
ఎందుకంటే: భారత్‌లో ప్రైవేట్‌రంగంలోని ఐదవ అతి పెద్ద బ్యాంక్. ఖాతాదారుడే కేంద్రంగా అత్యున్నత స్థాయి సేవలందిస్తోంది. కార్పొరేట్, ఇన్‌స్టిట్యూషన్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ ఫైనాన్స్, బ్రాంచ్ బ్యాంకింగ్, బిజినెస్ అండ్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్.. తదితర రంగాల్లో సేవలందిస్తోంది.
2020 కల్లా అత్యున్నత స్థాయి సేవలందించే భారతీయ బ్యాంక్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా 700 బ్రాంచీలు, 1,371 ఏటీఎంలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర వడ్డీ ఆదాయం 29 శాతం వృద్ధితో రరూ.856 కోట్లకు, నికర లాభం 27 శాతం వృద్ధితో రూ.610 కోట్లకు పెరిగాయి. కరంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్లు(కాసా) డిపాజిట్లు 40 శాతం పెరిగాయి.
బాసెల్ త్రి నిబంధనల కింద క్యాపిటల్ అడెక్వసీ రేషియో 14.9 శాతంగానూ, టైర్ వన్ క్యాపిటల్ 10 శాతంగానూ ఉన్నాయి. డిపాజిట్లు 24 శాతం వృద్ధితో రూ.99,344 కోట్లకు, రుణాలు 29 శాతం వృద్ధితో రూ.80,015 కోట్లకు పెరిగాయి. మ్యూచువల్ ఫండ్ వ్యాపార నిర్వహణ కోసం ఇటీవలనే రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి పొందింది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ టెక్నాలజీ(గిఫ్ట్) సిటీలో ఐఎఫ్‌ఎస్‌సీ బ్యాంక్ యూనిట్‌ను ప్రారంభించింది. స్థూల మొండి బకాయిలు 0.61 శాతంగానూ, నికర మొండి బకాయిలు 0.2 శాతంగానూ ఉన్నాయి. రిటైల్, బిజినెస్ బ్యాంకింగ్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తోంది.
క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ) కోసం బ్లూ డార్ట్, స్నాప్‌డీల్ సంస్థలతో ఇటీవలనే ఒప్పందాలు కుదుర్చుకుంది. రెండేళ్లలో నికర ఆదాయం 15 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మార్కెట్ ధరకు, పుస్తక ధరకు మధ్య వ్యత్యాసం ఈ ఆర్థిక సంవత్సరంలో 2.14గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.82 గానూ ఉండొచ్చని భావిస్తున్నాం.
ఇంద్రప్రస్థ గ్యాస్: కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ సెక్యూరిటీస్
ప్రస్తుత ధర: రూ. 513
టార్గెట్ ధర: రూ.580
ఎందుకంటే: వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందంటూ, ఢిల్లీలో కొంత కాలం వరకూ డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు పదేళ్ల కాలం మించిన డీజిల్ వాహనాలను రెన్యూవల్‌కు అనుమించవద్దని జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ గుండా ప్రయాణించే తేలిక, మధ్య, భారీ రకం వాణిజ్య వాహనాలపై పర్యావరణ పరిహార చార్జీని సుప్రీం కోర్టు దాదాపు రెట్టింపు చేసింది.
దీంతో ఈ వాహనాల సంఖ్య తగ్గి సీఎన్‌జీతో నడిచే వాహనాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఈ అంశాల కారణంగా ఇంద్రప్రస్థ గ్యాస్ కంపెనీ సీఎన్‌జీ విక్రయాలు పెరుగుతాయని అంచనా. సీఎన్‌జీ ఇంధనంతో నడిచే పదివేల ఆటో రిక్షాలకు అనుమతివ్వడానికి చర్యలు తీసుకోవడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సీఎన్‌జీతో నడిచే సిటీబస్సుల కొనుగోళ్లకు ఆమోదం లభించనుండడం.. వంటి అంశాల వల్ల భవిష్యత్తులో సీఎన్‌జీ అమ్మకాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నాం.
ప్రస్తుతం ఈ కంపెనీకి 326 సీఎన్‌జీ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. రెండేళ్లలో వంద కొత్త సీఎన్‌జీ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేయడం ద్వారా తన నెట్‌వర్క్‌ను కంపెనీ 30 శాతం విస్తరిస్తోంది. కంపెనీ మొత్తం విక్రయాల్లో 75 శాతం వాటా సీఎన్‌జీ విభాగానిదే. మార్జిన్లు కూడా ఈ విభాగం నుంచే అధికంగా వస్తున్నాయి. డిమాండ్ పెరిగితే అమ్మకాలూ, మార్జిన్లు పెరుగుతాయ్. మరోవైపు దేశీయంగా గ్యాస్ ధరలు తగ్గుతున్నాయి.
దీంతో మార్జిన్లు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. గత ఐదేళ్లుగా సీఎన్‌జీ విక్రయాలు 7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో రెండేళ్లలో ఈ విక్రయాలు రెండంకెల వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
స్టాక్స్ వ్యూ
Published Mon, Dec 28 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM
Advertisement
Advertisement