న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో రూ.2,195 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.104 కోట్ల నికర లాభం నమోదైంది. మొండి బకాయిలు భారీగా పెరగడంతో ఆ మేరకు కేటాయింపులు కూడా పెంచడమే ఈ భారీ నష్టాలకు కారణమని బ్యాంక్ వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కూడా భారీగానే నికర నష్టాలు, రూ.870 కోట్ల మేర వచ్చాయని తెలిపింది.
మొండి బకాయిలకు కేటాయింపులు దాదాపు 3 రెట్లకు పైగా పెరిగాయి. ఈ కేటాయింపులు రూ.1,193 కోట్ల నుంచి రూ.3,545 కోట్లకు ఎగిశాయి. మొత్తం ఆదాయం రూ.6,913 కోట్ల నుంచి రూ.6,046 కోట్లకు తగ్గింది. పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2016–17లో రూ.359 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,223 కోట్ల నికర నష్టాలు వచ్చాయి.
ఆదాయం రూ.26,461 కోట్ల నుంచి రూ.24,582 కోట్లకు తగ్గింది. గత ఏడాది మార్చి నాటికి 8.50 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 11.53%కి, నికర మొండి బకాయిలు 5.21% నుంచి 6.28%కి ఎగిశాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సిండికేట్ బ్యాంక్ షేర్ 3 శాతం వరకూ నష్టపోయి రూ.50 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment