‘ఆ 3 లక్షల కోట్లపై ఆరా తీయండి’ | target Rs 3 lakh crore unexplained cash deposits during note ban  | Sakshi
Sakshi News home page

‘ఆ 3 లక్షల కోట్లపై ఆరా తీయండి’

Published Fri, Sep 29 2017 8:42 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

target Rs 3 lakh crore unexplained cash deposits during note ban  - Sakshi

సాక్షి, ముంబై: నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు చేరిన సొమ్ములో సరైన వివరణ లేని రూ.3 లక్షల కోట్ల విలువైన డిపాజిట్లను టార్గెట్‌ చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఆదాయ పన్ను అధికారులకు సూచించింది. ఆ సొమ్ముపై పన్ను వసూలు చేయాలని సీబీడీటీ ఛైర్మన్‌ సుశీల్‌ చం‍ద్ర ఐటీ సీనియర్‌ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోరారు. నోట్ల రద్దు అనంతరం భారీగా డబ్బులు డిపాజిట్‌ చేసిన వారు దానిపై సరైన వివరణ ఇవ్వకుంటే ఆ మొత్తంపై 60 శాతం వరకూ పన్ను, జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రక్రియలో ప్రతి కేసును కూలంకషంగా పరిశీలించడం ఆదాయ పన్ను శాఖకు తలకు మించిన భారంతో పాటు ఎంతో సమయం వెచ్చించాల్సి ఉంది. అయితే ఈ ఖాతాలపై సత్వరమే నిగ్గుతేల్చాలని, పన్ను వసూలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది.

నిస్తేజంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడంతో పాటు నోట్ల రద్దు విఫలమైందన్న విపక్షాల నోరు మూయించేందుకూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మొత్తాలకు సంబంధించి ఇప్పటికే ఆదాయ పన్ను అధికారులు అనుమానితులకు నోటీసులు జారీ చేశారు. వీటికి ఆయా ఖాతాదారుల నుంచి వివరణలు అందాకే ఐటీ శాఖ తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రక్రియపై పన్ను అధికారులు అత్యంత వేగంగా చర్యలు చేపడితేనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడి మెరుగవుతుందని, సిబ్బంది కొరత ఈ క్రమంలో ఆదాయ పన్ను శాఖకు అవరోధంగా ముందుకొస్తోందని ఐటీ వర్గాలు పేర్కొన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement