కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది. గతేడాది పన్ను ఆదా కోసం హడావుడిగా ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేసిన వారు... ఈ సారి అలా చేయకుండా తమకు అనుకూలమైన పన్ను ఆదా పథకాలపై ప్రారంభంలోనే దృష్టి సారించడం మంచిది.
ముఖ్యంగా ఆదాయపన్ను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపునకు అర్హత కలిగిన సాధనాల్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్) కూడా ఒకటి. ఈ విభాగంలో పదుల సంఖ్యలో పథకాలు ఇన్వెస్టర్ల ఎంపికను కష్టతరం చేస్తాయి. కనుక పనితీరు ఆధారంగా పరిశీలించతగిన పథకాల్లో ఎల్ అండ్ టీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఒకటి. ఒకవైపు పన్ను ఆదా, మరోవైపు చక్కని రాబడులకు ఇందులో అవకాశం ఉంటుందని భావించొచ్చు.
రాబడులెలా ఉన్నాయంటే...
గడిచిన ఏడాది, మూడేళ్ల కాలంలో చూసుకుంటే ఈఎల్‌ఎస్‌ఎస్ విభాగంలో ఎల్ అండ్ టీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఒకానొక మెరుగైన పథకంగా ఉంది. అయితే, 2014 నాటి ర్యాలీలో ఈ పథకం పనితీరు మిగిలిన పథకాలతో వెనుకబడినా, బెంచ్ మార్క్ కంటే ఎక్కువే రాబడులు ఇచ్చింది. ఇక గడిచిన రెండు సంవత్సరాల్లో ఈఎల్‌ఎస్‌ఎస్ విభాగంలో దీని పనితీరు అత్యుత్తమంగా ఉంది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. నెలవారీగా సిప్ లేదా ఏక మొత్తంలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
గడిచిన ఏడాదిలో 17.68 శాతం, మూడేళ్లలో 12.75 శాతం, ఐదేళ్లలో 19.56 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. పదేళ్ల కాలంలో రాబడులు వార్షికంగా 14.6 శాతం చొప్పున ఉన్నాయి. బెంచ్‌మార్క్ బీఎస్‌ఈ 200 రాబడులతో పోలిస్తే 5–6 శాతం అధికంగానే లాభాల్ని ఇస్తోంది. ఏడాది, మూడేళ్లలో యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ పథకాల కంటే మెరుగైన రాబడులనే అందించింది.
2008, 2011 మార్కెట్ పతనాల సమయంలో మిగిలిన ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల కంటే, బెంచ్ మార్క్ కంటే ఈ పథకం పెట్టుబడులు విలువ తక్కువగా క్షీణించడం గమనార్హం. గడిచిన ఐదేళ్ల కాలంలో బెంచ్ మార్క్‌తో పోలిస్తే 83 శాతం సమయాల్లో ఈ పథకమే రాణించింది.
పెట్టుబడుల్లో వైవిధ్యం
ఈ పథకం పెట్టుబడుల్లో చక్కని వైవిధ్యం ఉండడం ఇన్వెస్టర్ల కోణంలో సానుకూలం. పోర్ట్‌ఫోలియోలో 71 శాతం స్టాక్స్ ఉంటే, ఇవి 26 రంగాలకు చెందినవి కావడం పెట్టుబడుల వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. ఇక రిస్క్ ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ ఎక్స్‌పోజర్ తీసుకోవడం గమనించాల్సిన అంశం. దీనివల్ల దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది.
ఈ రంగాలకు ప్రాధాన్యం
బ్యాంకింగ్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. 2014లో బ్యాంకింగ్ రంగానికి 25 శాతం కేటాయింపులు చేయగా, ప్రస్తు్తతం అది 16.3 శాతానికి దిగొచ్చింది. గడిచిన ఏడాది కాలంలో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో పెట్టుబడులను తగ్గించుకుంది.
మైనింగ్, పెస్టిసైడ్ స్టాక్స్ నుంచి వైదొలిగింది. టెలికం, నాన్ ఫర్నెస్ మెటల్ స్టాక్స్ పోర్ట్ ఫోలియోలో వచ్చి చేరాయి. లార్జ్‌క్యాప్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎల్‌అండ్‌టీ ఉండటం స్థిరమైన రాబడులకు తోడ్పడుతోంది. ఇటీవలి కాలంలో చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్, జీఐసీ ఆఫ్ ఇండియా, సన్‌టీవీ నెట్‌వర్క్‌లో పెట్టుబడులు పెట్టింది.
టాప్‌హోల్డింగ్స్
స్టాక్ పేరు కేటాయింపుల శాతం
హెచ్‌డీఎఫ్‌సీ 4.15
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 3.96
గ్రాఫైట్ ఇండియా 3.76
ఎల్‌అండ్‌టీ 3.06
ఐటీసీ 2.74
ఐసీఐసీఐ బ్యాంకు 2.70
యాక్సిస్ బ్యాంకు 2.69
ఫ్యూచర్ లైఫ్‌స్టయిల్ 2.53
టీసీఎస్ 2.51
కోటక్ బ్యాంకు 2.35
Comments
Please login to add a commentAdd a comment