తెలుగు రాష్ట్రాలకు జీఎస్‌టీతో కష్టాలు | Telangana, Andhra Pradesh worry about GST effect on funds | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు జీఎస్‌టీతో కష్టాలు

Published Sat, Jun 17 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

తెలుగు రాష్ట్రాలకు జీఎస్‌టీతో కష్టాలు

తెలుగు రాష్ట్రాలకు జీఎస్‌టీతో కష్టాలు

పన్ను రాయితీల అధికారం ఇక ఉండదు 
ఇలాగైతే కొత్త కంపెనీలను ఆకర్షించటం కష్టం 
ఉన్న కంపెనీలు కూడా పునరాలోచన చేయొచ్చు  
ఉత్పాదక రంగంలోని రాష్ట్రాలకు జీఎస్‌టీతో దెబ్బే  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘ఒకే దేశం.. ఒకే పన్ను’.. ఇదీ జీఎస్‌టీ ప్రధాన ఉద్దేశం. కానీ, ఒకే పన్ను విధానం ఉత్పాదక రాష్ట్రాలకు నష్టాలను మిగులుస్తాయనేది నిపుణుల మాట. ఇందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు మినహాయింపేం కాదు. ఎలాగంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్‌.. మూలం ఆధారిత పన్ను. కానీ, జీఎస్‌టీ గమ్యస్థాన ఆధారిత పన్ను. వ్యాట్‌లో ఏదైనా వస్తువు ఉత్పత్తి తయారీలో ప్రతి దశలోనూ ట్యాక్స్‌ పడుతుంది. అదే జీఎస్‌టీలో.. తయారైన ఉత్పత్తిని విక్రయిస్తేనే పన్నుంటుంది. అంటే దీనర్థం ఉత్పత్తులను తయారు చేసే ఉత్పాదక రాష్ట్రాలకు నష్టమేగా!?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వ్యాట్, వినోదపు పన్ను, లగ్జరీ పన్ను, లాటరీ/గుర్రపు పందేల పన్ను, ప్రొఫెషినల్‌ ట్యా క్స్, గ్రామీణ సెస్సు, ప్రవేశ పన్నులను వసూలు చేస్తున్నాయి. ఆయా పన్నుల రూపంలో 2016–17లో తెలంగాణ రూ.42,564 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. ఇందులో సుమారు రూ.16,000 కోట్లు వ్యాట్‌దే. అదే ఆంధ్రప్రదేశ్‌లో రూ.39,907 కోట్ల ఆదా యం సమకూరితే.. ఇందులో వ్యాట్‌ వాటా రూ.12,000 కోట్లు.

రాష్ట్రాల అధికారం గోవింద..
జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాలు నియంత్రణ అధికారాన్ని కోల్పోతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నేతలు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నారు. పారిశ్రామిక విధానం, ఐటీ పాలసీలు, సులువైన వ్యా పార విధానాలనూ అమలు చేస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలిస్తామంటూ పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు వ్యాట్‌ తగ్గింపులతో పాటూ తక్కువ ధరకే స్థల కేటాయింపు, విద్యుత్‌ బిల్లులో రాయితీ, రోడ్లు, మంచి నీటి వంటి మౌలిక సదుపాయాలనూ ఈ రాష్ట్రాలు కల్పిస్తున్నాయి. జీఎస్‌టీ అమలయ్యాక రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను విధింపు, తగ్గింపు అధికారాలు కనుమరుగవుతాయి. అవి పూర్తిగా జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిధిలోకి వెళతాయి.

జీఎస్‌టీలో రాయితీలుండవ్‌..
ఇన్నాళ్లూ స్థానిక ప్రభుత్వాల నుంచి పన్ను, ఇతరత్రా రాయితీలు పొందిన కంపెనీలకు జీఎస్‌టీ అమలుతో అవి కనుమరుగవుతాయి. దీంతో లాభాలు తగ్గుముఖం పడతాయని కేపీఎంజీ పరోక్ష పన్ను పార్టనర్‌ సంతోష్‌ దాల్వి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. అలాగే స్థానిక పన్నుల వసూళ్లతో రాష్ట్రాలూ తీవ్రంగానే నష్టపోతాయన్నారు. దేశమంతటా ఒకే తరహా పన్ను విధానం, స్థానిక రాష్ట్ర రాయితీలు లభించనప్పుడు కంపెనీలకు ఏ రాష్ట్రంలో అయితే మౌలిక, రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉంటాయో అక్కడే ప్లాంట్లను ఏర్పాటు చేసే స్వేచ్ఛ కలుగుతుందని వివరించారు. దీంతో రాష్ట్రాల మధ్యే పోటీ పెరుగుతుందని, కాకపోతే ఇది అంత త్వరగా తేలే విషయం కాదని చెప్పారు.

ఎంవోయూల పునఃసమీక్షలో కంపెనీలు..
జీఎస్‌టీ అమలుతో ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణకు నష్టం కాస్త ఎక్కువే. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలూ అందనప్పుడు స్థానిక కంపెనీలకు రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదు. కనీసం ఏపీలోని తయారీ సంస్థలైనా స్థానికంగా ఉన్న సముద్రాన్ని ఎగుమతుల కోసం వినియోగించుకునే అవకాశముందని ఓ కంపెనీ ప్రతినిధి వివరించారు. ఒకవేళ స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు గనక చేతులెత్తేస్తే.. కార్యకలాపాల విస్తరణ వంటి వాటికి దూరంగా ఉంటే మరింత ప్రమాదమే. మరోవైపు ఇన్నాళ్లూ పన్ను రాయితీలను చూసి వచ్చిన కంపెనీలు ఇప్పుడు ఎంవోయూలను పునః సమీక్షించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లోని వాహన తయారీ కంపెనీలివే..
ప్రస్తుతం తెలంగాణలోని జహీరాబాద్‌లో 100 ఎకరాల్లో మహీం ద్రా అండ్‌ మహీంద్రా ట్రాక్టర్ల ప్లాంట్, మెదక్‌లోని కోడకచాని గ్రామంలో 18 ఎకరాల్లో డెక్కన్‌ ఆటో లిమిటెడ్‌ బస్‌ బాడీ యూనిట్లున్నాయి. ఏపీలో శ్రీసిటీలో 107 ఎకరాల్లో ఇసుజు మోటార్స్‌ ఇండియా ఎస్‌యూవీ ప్లాంట్, 20 ఎకరాల్లో కొబెల్కో క్రెయిన్‌ ప్లాంటు, చిత్తూరులోని సత్యవీడులో 600 ఎకరాల్లో హీరో మోటోకార్ప్‌ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్లున్నాయి.

ఎంవోయూలు కూడా..: గతేడాది అక్టోబర్‌లో తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడులతో బస్, ట్రక్స్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అశోక్‌ లేలాండ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. హ్యుందాయ్‌ మోటార్స్‌ అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్‌.. అనంతపురంలోని ఎర్రమంచి గ్రామంలో 600 ఎకరాల్లో కార్ల తయారీ యూనిట్‌నూ ఏర్పాటు చేసేందుకు  ఒప్పందం చేసుకుంది.

నష్టాల నుంచి ఊరట...
ఇదిలా ఉంటే జీఎస్‌టీ అమలుతో ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు పరిహారాన్నిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. నష్టపోయిన ఆదాయంలో తొలి మూడేళ్లు 100 శాతం, నాలుగవ సంవత్సరం 75 శాతం, చివరి సంవత్సరం 50 శాతం పరిహారంగా అందిస్తుంది. అలాగే రెండు రాష్ట్రాల మధ్య వస్తువులు, సేవలు జరిపే సంస్థల నుంచి రెండేళ్ల పాటు జీఎస్‌టీ పన్నుతో పాటు 1 శాతం అదనపు పన్నునూ వసూలు చేస్తుంది. దీన్ని నష్టపోతున్న రాష్ట్రాలకు అందజేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement