మళ్లీ పసిడికి డిమాండ్!
ధర తగ్గుదలతో కొనుగోళ్లు పెరుగుతాయ్
♦ పెళ్లిళ్లు, పండుగల సీజన్ ఊతం
♦ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక
న్యూఢిల్లీ :ప్రతికూల వాతావరణ పరిస్థితులు గ్రామీణ ప్రాంతాలవారి ఆదాయాలపై ప్రభావం చూపడంతో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్‌లో పసిడికి డిమాండ్ 25 శాతం తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తెలిపింది. అయితే, ఇటీవలి కాలంలో ధరలు కూడా గణనీయంగా తగ్గడంతో ఈ ఏడాది ద్వితీయార్థంలో పసిడికి మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని గురువారం ఒక నివేదికలో వివరించింది. బంగారం వినియోగంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో.. గతేడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో పసిడికి డిమాండ్ 204.9 టన్నులు ఉండగా ఈసారి మాత్రం 154.5 టన్నులకు పడిపోయింది. దిగుమతులు స్వల్పంగా తగ్గి 206.2 టన్నుల నుంచి 205 టన్నులకు క్షీణించాయి. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే (372 టన్నులు) ఈ ఏడాది ప్రథమార్ధంలో పసిడి డిమాండ్ 7 శాతమే క్షీణించి 346.2 టన్నులుగా నమోదయ్యింది.
ప్రస్తుత సంవత్సరం ప్రథమార్ధం ఎలా గడిచినప్పటికీ జూలై- డిసెంబర్ మధ్య కాలంలో మాత్రం పసిడికి డిమాండ్ మెరుగుపడగలదని భావిస్తున్నట్లు డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. గడిచిన కొన్ని వారాలుగా పసిడి రేట్లు తగ్గినందున కొనుగోలుదారులు మళ్లీ కొనడం మొదలుపెట్టడంతో సానుకూల డిమాండ్ నెలకొంటోందని ఆయన వివరించారు. సాధారణంగా ధరలపై ఎక్కువగా దృష్టి పెట్టే మార్కెట్లలో.. రేట్లు తగ్గడమనేది కొనుగోళ్లకు సరైన సమయంగా పరిగణించవచ్చని సోమసుందరం పేర్కొన్నారు.
ఆసియా, మధ్యప్రాచ్య మార్కెట్లలో ధరల తగ్గుదలతో కొనుగోళ్లు పెరుగుతుంటాయని, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోందని ఆయన వివరించారు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో పెళ్లిళ్లు, పండుగలు ఉండనున్న నేపథ్యంలో ఆభరణాలకు డిమాండ్ ఉండగలదని డబ్ల్యూజీసీ తెలిపింది. డిమాండ్ మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. ఇదంతా వర్షపాతం సాధారణ స్థాయిలో ఉన్న పక్షంలోనే సాధ్యమని డబ్ల్యూజీసీ పేర్కొంది.
ఆసియాలో 12% తగ్గిన పసిడి డిమాండ్
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ క్యూ2) ఆసియాలో పసిడి డిమాండ్ 12 శాతం మేర క్షీణించి ఆరేళ్ల కనిష్టం 914.9 టన్నులకు పడిపోయిందని డబ్ల్యూజీసీ తెలిపింది. ప్రధాన మార్కెట్లయిన భారత్, చైనాలో డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని వివరించింది. గతేడాది క్యూ2లో 1,038 టన్నులకు డిమాండ్ నమోదైనట్లు డబ్ల్యూజీసీ నివేదికలో వెల్లడించింది.
బంగారం... నెల గరిష్ట స్థాయి
ముంబై: పసిడి జోరు వరుసగా ఆరవ రోజూ కొనసాగింది. ముంబై బులియన్ మార్కెట్‌లో ధర నెల గరిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీ ప్రతికూలాంశాలు, పండుగ సీజన్‌లో ఆభరణ వర్తకుల డిమాండ్ దీనికి ప్రధాన కారణం. ఇక్కడి స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.125 పెరిగి, రూ.25,875కు చేరింది. 22 క్యారెట్ల ధర కూడా అంతే మొత్తం పెరిగి రూ.25,725కు ఎగసింది. కాగా వెండి కూడా కేజీకి రూ.195 పెరిగి రూ.36,435కు చేరింది.