
రాత్రి ఆర్డర్.. పొద్దున్నే డెలివరీ..!
డ్రాప్ షిప్పింగ్ విధానంతో 4 గంటల్లో డెలివరీ
* 200 నగరాల్లో 5 వేల మంది వర్తకులతో ఒప్పందం
* ఈ ఏడాది రూ.400 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
* ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో సైబర్‌ప్లేస్.కామ్ ఫౌండర్, సీఈఓ ఉర్వేష్ గోయల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇపుడు ఆన్‌లైన్ షాపింగ్ గురించి తెలియని వారెవరూ లేరు. తె లిసినవారిలో ఆన్‌లైన్ షాపింగ్ చేయనివారూ ఉండరు. కాకపోతే ఈ షాపింగ్‌లో చిక్కల్లా డెలివరీనే. డెలివరీకి కనీసం రెండు రోజుల నుంచి గరిష్టంగా వారం పదిరోజులు కూడా పడుతుండటమే దీన్లో అసలైన సమస్య.
దీనికి పరిష్కారం గానే... ఇపుడు చాలా సంస్థలు ఒకరోజులో డెలివరీకి శ్రీకారం చుడుతున్నాయి. కాకపోతే ఈ డెలివరీ ఎక్కువ కిరాణా సరుకులు, కూరగాయలకే పరిమితమవుతోంది. దీంతో మొబైల్ ఫోన్లకూ ఇలాంటి ఎక్స్‌ప్రెస్ డెలివరీని పరిచయం చేయటానికి శ్రీకారం చుడుతోంది హైదరాబాదీ స్టార్టప్ సైబర్‌ప్లేస్. డ్రాప్ షిప్పింగ్ విధానంతో కేవలం 4 గంటల్లో ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందీ సంస్థ. 2008లో ప్రారంభమైన సైబర్‌ప్లేస్.కామ్ సేవలు, విస్తరణ ప్రణాళిక గురించి సంస్థ ఫౌండర్, సీఈఓ ఉర్వేష్ చంద్ర గోయల్ మాటల్లోనే..
’’2004 వరకు అమెరికాలో స్ప్రింట్ టెలికాంలో డెరైక్టర్‌గా పనిచేశా. తర్వాత ఇండియాకు తిరిగొచ్చి హైదరాబాద్‌లో కన్వర్జెన్స్ కార్పొరేషన్‌లో డెరైక్టర్‌గా చేరా. ఆ సమయంలో దేశంలో రోజురోజుకూ విస్తరిస్తున్న స్మార్ట్‌ఫోన్ల విక్రయం నన్ను ఆకట్టుకుంది. ఆన్‌లైన్ ద్వారా కేవలం స్మార్ట్‌ఫోన్లనే విక్రయించాలని నిర్ణయించుకొని రూ.2 కోట్లతో 2008లో హైదరాబాద్ కేంద్రంగా సైబర్‌ప్లేస్ ఈ సొల్యూషన్స్‌ను ప్రారంభించా.
డ్రాప్‌షిప్పింగ్‌తో 4 గంటల్లో...
కస్టమర్లిచ్చిన ఆర్డర్‌ను త్వరగా డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్ కంపెనీలు ఆయా నగరాల్లో గోదాములు ఏర్పాటు చేసుకుంటాయి. ఇందులో సరుకుల్ని నిల్వ చేసుకొని డెలివరీ చేస్తుంటాయి. దీనికోసం భూమి కొనుగోలు, ముందస్తుగానే ఉత్పత్తుల కొనుగోళ్లు, అదనపు ఉద్యోగుల నియామకం, నిర్వహణ వంటివి చేయాలి. దీనికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందుకే తొలిసారిగా డ్రాప్‌షిప్పింగ్ విధానాన్ని తీసుకొచ్చాం.
ఈ విధానంలో నేరుగా దగ్గర్లోని వ్యాపారి నుంచి కస్టమర్‌కి వస్తువు చేరిపోతుంది. డెలివరీలో వస్తువు డ్యామేజీ సమస్య ఉండదు. నాణ్యమైన వస్తువులు తక్కువ సమయంలో కస్టమర్ల ఇంటికి చేరిపోతాయి. దీనికోసం దేశంలోని 200 నగరాల్లో 5 వేల మంది స్థానిక వర్తకులతో ఒప్పందం చేసుకుంటున్నాం. ఇప్పటికే 100 మందితో ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇందులో హైదరాబాద్ నుంచి 2-5 మంది వర్తకులున్నారు.
3 లక్షల మంది కస్టమర్లు...: సైబర్‌ప్లేస్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్లెట్స్, వాటి యాక్ససరీలు మాత్రమే అన్ని బ్రాండ్లవీ లభిస్తాయి. ధర రూ.4 వేల నుంచి రూ.65 వేల మధ్య ఉంటుంది. ఈ ఏడాది ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్లతో విస్తరిస్తాం. బ్లూడార్ట్, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, గో జావాస్, గతి, ఆరామెక్స్ వంటి 8 లాజిస్టిక్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటివరకు 3 లక్షల మంది కస్టమర్లకు సేవలందించాం.
రోజుకు రూ.4 కోట్ల వ్యాపారం లక్ష్యం
దేశవ్యాప్తంగా అన్ని పిన్‌కోడ్లలో సేవలందిస్తున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వ్యాపారం బాగుంది. ఇక్కడి నుంచి 60% ఆర్డర్లున్నాయి. మొత్తం వ్యాపారంలో 95% వాటా స్మార్ట్‌ఫోన్లదే. ప్రస్తుతం రోజుకు రూ.20 లక్షల వ్యాపారం చేస్తున్నాం. దీన్ని రూ.4 కోట్లకు చేర్చాలన్నది మా లక్ష్యం. గతేడాది రూ.100 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 100 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాదిలో మరో 100 మందిని నియమించుకుంటాం. సెప్టెంబర్ నుంచి ట్రిపుల్ ఐటీ, ఐఐఐఎంల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి.
ఈ ఏడాది ఐపీఓ...
రోజురోజుకూ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ పెరుగుతోంది కనక ఈ ఏడాది 1,200 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాం. మేరీజేబ్ వ్యాలెట్ పేరిట పేమెంట్ గేట్‌వే సొల్యూషన్ సేవలకూ విస్తరించాం. సీడ్ ఫండింగ్‌లో భాగంగా గ తంలో రూ.2 కోట్లు నిధులను సమీకరించాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రూ.400 కోట్ల పెట్టుబడులపై దృష్టి సారించాం. ఒకరిద్దరు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఈ ఏడాది ముగిసేలోగా పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని ఉర్వేష్ గోయల్ వివరించారు.