
ఫోర్బ్స్ సృజనాత్మక కంపెనీల్లో మూడు దేశీ సంస్థలు
న్యూఢిల్లీ: నూతన ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచంలోనే 100 అత్యుత్తమ సృజనాత్మక కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ లిస్టులో హిందుస్తాన్ లీవర్ (హెచ్‌యూఎల్), ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి. హెచ్‌యూఎల్ క్రితం సారి 31వ స్థానంలో ఉండగా ఈసారి ఏడో స్థానానికి, ఏషియన్ పెయింట్స్ 18వ స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకాయి. ఎయిర్‌టెల్ కొత్తగా 78వ ర్యాంకుతో లిస్టులో చోటు దక్కించుకుంది. టీసీఎస్, సన్ ఫార్మా, లార్సన్ అండ్ టూబ్రో గతేడాది జాబితాలో ఉన్నప్పటికీ ఈసారి స్థానం లభించలేదు. దీంతో లిస్టులో భారతీయ సంస్థల సంఖ్య అయిదు నుంచి మూడుకి తగ్గింది. ఈసారి జాబితాలో టెస్లా మోటర్స్‌ను రెండో స్థానానికి నెట్టి సేల్స్‌ఫోర్స్‌డాట్‌కామ్ అగ్రస్థానంలో నిల్చింది. అమెజాన్‌డాట్‌కామ్ మూడో స్థానంలో ఉంది. వర్తమానంలోనూ, భవిష్యత్‌లోనూ మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేయగలవని ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్న కంపెనీలు ఈ జాబితాలో ఉంటాయి. కనీసం 10 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ గల సంస్థలకు ఇందులో చోటు ఉంటుంది.
ఎంసీఎక్స్‌లో బంగారం ఆప్షన్ల కాంట్రాక్టులు
బంగారం ఫ్యూచర్స్‌లో ఆప్షన్ల కాంట్రాక్టులను ప్రారంభిం చేందుకు ఎంసీఎక్స్‌కు సెబీ ఆమోదం తెలిపింది. ‘‘రానున్న కొన్ని వారాల్లో ఆప్షన్ల కాంట్రాక్టు సైజు, ఇతర వివరాలు, ప్రారంభ తేదీని ప్రకటిస్తాం’’ అని ఎంసీఎక్స్ ప్రతినిధి గిరీష్‌దేవ్ తెలిపారు. కమోడిటీ మార్కెట్లో ఆప్షన్ల ప్రారంభానికి జూన్‌లో సెబీ అనుమతించగా, ఒక ఎక్సేంజ్ ఏదేనీ ఒక కాంట్రాక్టులోనే దీన్ని ప్రారంభించాలన్న పరిమితి విధించింది.