ఇక భారత్‌లో ‘టోటల్’ పెట్రోల్ బంకులు!
► స్థానిక భాగస్వామ్యంపై ఆసక్తి
► కంపెనీ సీఈవో పాట్రిక్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన రిటైల్ వ్యాపారంలో ఉన్న అపార అవకాశాలపై ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎస్‌ఏ కన్నేసింది. స్థానికంగో ఓ భాగస్వామితో కలసి పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు టోటల్ వెల్లడించింది. టోటల్‌ఎస్‌ఏ ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో లూబ్రికెంట్లు, ఎల్‌పీజీని విక్రయిస్తోంది. ‘‘ఇది చాలా పెద్ద మార్కెట్. ఇండియన్ ఆయిల్ తదితర పెద్ద సంస్థలు వేలాది రిటైల్ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్నాయి. ఈ మధ్యే ఈ మార్కెట్‌ను నియంత్రణల నుంచి తప్పించారు.
దీంతో ఈ మార్కెట్ గురించి ఆలోచిస్తున్నాం’’ అని టోటల్ సీఈవో పాట్రిక్ పోయెన్నే తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నామని, సరైన భాగస్వామిని గుర్తించాల్సి ఉందన్నారు. ‘‘అంతర్జాతీయంగా ఈ రంగంలో మాది అతిపెద్ద కంపెనీ. మా దగ్గర నిధులు, ఆర్థిక సామర్థ్యం ఉంది. ఈ వ్యాపారంలో నైపుణ్యం కూడా ఉంది’’ అని వివరించారు. పాట్రిక్ అంతకుముందు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ సమావేశమయ్యారు. ఎల్‌పీజీ నిల్వ, దిగుమతి టెర్మినళ్లు, పంపిణీపై పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వం తరఫున టోటల్‌కు సాధ్యమైనంత సహకారాన్ని అందిస్తామని ప్రధాన్ హామీ ఇచ్చారు.