
న్యూఢిల్లీ : మొబైల్ టెర్మినేషన్ కాల్‌ఛార్జీలను భారీగా తగ్గించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెల్కోలకు మరో షాకివ్వబోతుంది. ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జీలను కూడా సగం తగ్గించబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నిమిషానికి 53 పైసలుగా ఉన్న ఈ ఛార్జీలను 25 నుంచి 30 పైసలకు తగ్గించబోతున్నారని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఈ విషయంపై ట్రాయ్ నేడు ఓ ప్రకటన విడుదల చేయబోతున్నట్టు కూడా పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జీలను ఓ టెలికాం ఆపరేటర్, కాల్ టర్మినేట్ చేసే సర్వీసు ప్రొవైడర్‌కు చెల్లిస్తారు. మొబైల్స్, ల్యాండ్‌లైన్ కాల్స్ అన్నింటికీ ఈ ఛార్జీలను చెల్లిస్తారు. ఈ ఛార్జీను ఇంటర్నేషనల్ ఆపరేటర్ తన సబ్‌స్క్రైబర్ నుంచి రికవరీ చేసుకుంటారు.
2015 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జీలను నిమిషానికి 40 పైసల నుంచి 53 పైసలకు ట్రాయ్ పెంచింది. అదే సమయంలో మొబైల్ టర్మినేషనల్ ఛార్జీలను మాత్రం నిమిషానికి 20 పైసల నుంచి 14 పైసలకు తగ్గించింది. ప్రస్తుతం మొబైల్ టర్మినేషన్ ఛార్జీలను మరింత కిందకి 6 పైసలకు తీసుకొస్తున్నట్టు 2017 సెప్టెంబర్ 19న తెలిపింది. ఈ ఛార్జీలను జీరో చేయాలని యోచిస్తున్నట్టు ట్రాయ్ పేర్కొంది. అయితే 2017 సెప్టెంబర్ 19న మాత్రం ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జీల సమీక్షను తర్వాత చేపడతామని తెలిపింది. ఈ విషయంపై ప్రత్యేక నియంత్రణ అవసరమని అథారిటీ వెల్లడించింది. అయితే తాజాగా ట్రాయ్ తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై ఇంటర్నేషనల్ టెలికాం సంస్థలు ఏటీ అండ్ టీ, వెరిజోన్ హర్షం వ్యక్తంచేస్తుండగా.. దేశీయ టెలికాం ఆపరేటర్ల మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. మరోసారి తమ రెవెన్యూలకు గండిపడబోతుందని టెల్కోలు ఆందోళనలు వ్యక్తంచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment