ట్రాన్ సెల్ లో ఐఏఎన్ పెట్టుబడి
♦ 25 శాతం వాటాకు రూ.15-20 కోట్లు
♦ వీటిని మాలిక్యూల్స్ అభివృద్ధికి వెచ్చించనున్న సంస్థ
♦ వచ్చే మూడేళ్లలో మస్క్యులర్ డిస్ట్రొఫీకి ఔషధం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయోటెక్నాలజీ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ట్రాన్‌సెల్ బయాలాజిక్స్‌లో ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్ (ఐఏఎన్) పెట్టుబడి పెట్టింది. డీల్ విలువ రూ.15-20 కోట్లు ఉన్నట్టు సమాచారం. కంపెనీలో ఐఏఎన్ 22-25 శాతం వాటా దక్కించుకున్నట్టు తెలుస్తోంది. మూల కణ ఆధారిత ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో కంపెనీ చేస్తున్న పరిశోధన, దీర్ఘకాలిక వ్యూహం ఐఏఎన్‌ను ఆకట్టుకుంది. ఇక డీల్ ద్వారా వచ్చిన మొత్తాన్ని మాలిక్యూల్స్ అభివృద్ధికి ట్రాన్‌సెల్ వెచ్చించనుంది. మస్క్యులర్ డిస్ట్రొఫీ చికిత్సకు మూలకణ ఆధారిత ఔషధం అభివృద్ధికై ఇప్పటికే ట్రాన్‌సెల్ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది. 2018 నాటికి ఔషధాన్ని తేవాలన్నది సంస్థ లక్ష్యం. ఔషధాన్ని తొలుత యూరప్‌లో విక్రయించాలని ట్రాన్స్‌సెల్ భావిస్తోంది. అక్కడ డిస్ట్రొఫీ బాధితులు ఎక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ట్రాన్‌సెల్ బోర్డులోకి ఐఏఎన్ నుంచి సంజయ్ జెస్రానీ రానున్నారు.
ఇతర చికిత్సలకూ..
క్యాన్సర్, అల్జీమర్స్ చికిత్సకు మూల కణ ఆధారిత మాలిక్యూల్స్‌ను తీసుకురావాలని ట్రాన్‌సెల్ కృతనిశ్చయంతో ఉంది. ఏడాదిలో ఈ ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుందని కంపెనీ భావిస్తోంది. రానున్న రోజుల్లో ఇతర వ్యాధుల చికిత్సకు కూడా ఔషధాలను అభివృద్ధి చేయనుంది.
కాగా, ట్రాన్‌సెల్‌ను మూల కణ రంగ శాస్త్రవేత్త సుభద్ర ద్రావిడ ఏర్పాటు చేశారు. స్టెమ్‌సెల్ బ్యాంకింగ్, ప్రాసెసింగ్ సేవలతో కంపెనీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 8,500 శాంపిళ్లను భద్రపరిచే సామర్థ్యం కంపెనీకి ఉంది. శ్రీలంక, దుబాయ్‌తోపాటు పలు దేశాల్లో సేవలను విస్తరించిన ఈ సంస్థ త్వరలో ఆఫ్రికాలో అడుగు పెడుతోంది. సేకరించిన మూలకణాలు రవాణాలో 48 గంటల పాటు భద్రంగా ఉండేలా ప్రత్యేక వ్యవస్థను కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసింది. విదేశాల్లోనూ సేకరించిన స్టెమ్ సెల్స్‌ను హైదరాబాద్ సెంటర్‌లో నిల్వ చేస్తోంది. ఐఏఎన్ ప్రపంచంలో అతిపెద్ద బిజినెస్ ఏంజెల్ గ్రూప్ కావడం విశేషం.