ఇక రోజువారీ పరిమితి రూ.25వేలు
ఇక రోజువారీ పరిమితి రూ.25వేలు
Published Mon, Sep 18 2017 1:59 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM
సాక్షి, ముంబై : డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే చర్యలో భాగంగా దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఫండ్ ట్రాన్సఫర్ పరిమితులను పెంచింది. మొబైల్ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా జరిపే ఫండ్ ట్రాన్సఫర్ పరిమితులను పెంచుతున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. యూజర్లు రోజూ తమ అకౌంట్‌లలోకి మొబైల్ ఫోన్ బ్యాంకింగ్ సర్వీసుల ద్వారా రూ.25వేల వరకు ట్రాన్సఫర్ చేసుకోవచ్చని ఎస్‌బీఐ చెప్పింది. అదే థర్డ్ పార్టీ అకౌంట్లకు అయితే రోజుకు రూ.10వేలు ట్రాన్సఫర్ చేసుకోవచ్చని పేర్కొంది. నెలవారీ అయితే సొంత అకౌంట్లకు ఎలాంటి పరిమితులు లేవు. కానీ థర్డ్ పార్టీ అకౌంట్లకు రూ.50వేల వరకే ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. 5000 రూపాయలకు మించి ఫండ్ ట్రాన్సఫర్లకు ఓటీపీ అవసరం పడుతుందని ఎస్‌బీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
అదేవిధంగా ఏటీఎం లావాదేవీలు ఉచితానికి మించి వినియోగించుకుంటే, 18 శాతం జీఎస్టీ ఛార్జీలను బ్యాంకు విధించనుంది. ఒకవేళ లావాదేవీ జరుగకపోయినా కూడా పన్ను భారాన్ని భరించాల్సిందేనని బ్యాంకు పేర్కొంది. ఏటీఎంలలో కార్డులెస్ లావాదేవీలకు జీఎస్టీతో పాటు జీఎస్టీని భరించాల్సి ఉంటుంది. కాగ, మెట్రో సిటీల్లో సేవింగ్స్ బ్యాంకు కస్టమర్లకు ఎనిమిది ఏటీఎం లావాదేవీలు ఉచితం. దీనిలో ఐదు ఎస్‌బీఐ ఏటీఎం ద్వారా, మిగతా మూడు నాన్-ఎస్‌బీఐ ఏటీఎం ద్వారా ఉచితం. అదే నాన్-మెట్రో సిటీల్లో అయితే 10 ఏటీఎం లావాదేవీలు ఉచితం. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు నెలకు కేవలం నాలుగు ఏటీఎం లావాదేవీలు మాత్రమే ఉచితంగా లభించనున్నాయి. ఈ పరిమితిని దాటితే ఎస్‌బీఐ ఏటీఎం వద్దనైతే రూ.10 ప్లస్ పన్ను. ఇతర బ్యాంకు ఏటీఎంల వద్దనైతే 20 రూపాయలతో పాటు పన్నును భరించాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement