ప్రపంచ ట్రెండ్ ఆధారం.. | Trend is the basis for the world .. | Sakshi
Sakshi News home page

ప్రపంచ ట్రెండ్ ఆధారం..

Published Mon, Aug 15 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

ప్రపంచ ట్రెండ్ ఆధారం..

ప్రపంచ ట్రెండ్ ఆధారం..

ద్రవ్యోల్బణం డేటా కూడా కీలకం
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా


ముంబై: ఈ వారం భారత్ మార్కెట్ కదలికలు ప్రపంచ ట్రెండ్ ఆధారంగా వుంటాయని నిపుణులు అంచనావేస్తున్నారు. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని వారంటున్నారు. ప్రపంచ మార్కెట్ల నుంచి అందే సంకేతాలు, రుతుపవనాల కదలికల్ని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధృవ్ దేశాయ్ చెప్పారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వెల్లడించే కమిటీ సమావేశపు మినిట్స్, క్రూడాయిల్ నిల్వల పరిస్థితి ప్రపంచ ట్రెండ్‌ను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. గతవారం ముడి చమురు ధర జోరుగా పెరగడం ప్రపంచ మార్కెట్ల ర్యాలీకి దోహదపడిందని, ఫలితంగా కనిష్టస్థాయి నుంచి భారత్ మార్కెట్ కూడా పెరిగిందని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ వివరించారు. ఈ బుధవారం వెలువడే అమెరికాలో చమురు నిల్వల డేటా, అదేరోజున వెల్లడయ్యే ఫెడ్ మినిట్స్ ట్రెండ్‌ను శాసిస్తాయని ఆయన అన్నారు. డిసెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచేదీ, లేనిదీ ఈ మినిట్స్ ద్వారా ఇన్వెస్టర్లు అంచనాల్ని ఏర్పర్చుకుంటారు.

 
దేశీయ డేటా...

ఈ వారం ప్రథమార్థంలో వెలువడే టోకు ద్రవ్యోల్బణం డేటా కూడా మార్కెట్‌కు కీలకమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన జూలై నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకు ఈ వారం ట్రేడింగ్ తొలిరోజైన మంగళవారం మార్కెట్ స్పందించనుంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించింది. ఇలా ద్రవ్యోల్బణం పెరగడం ఇన్వెస్టర్లకు షాకేనని, ఈ వారం వెలువడే టోకు ద్రవ్యోల్బణం కూడా పెరిగితే రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు సన్నగిల్లుతాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ హెడ్ పంకజ్ శర్మ అన్నారు.

 
గతవారం మార్కెట్..

ఆగస్టు 12తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ స్వల్పంగా 74 పాయింట్ల పెరుగుదలతో 28,152 పాయింట్ల వద్దకు చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మాత్రం 11 పాయింట్లు క్షీణించి 8,672 పాయింట్ల వద్ద ముగిసింది.


నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  సోమవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ...  స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement