టీవీఎస్‌కు డిస్కౌంట్ల భారం
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.127 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.136 కోట్లతో పోలిస్తే 7 శాతం తగ్గిందని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. బీఎస్–త్రీ వాహన విక్రయాల కోసం డీలర్లకు రూ.57 కోట్ల మేర డిస్కౌంట్లను ఇవ్వడం వల్ల నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.3,091 కోట్ల నుంచి రూ.3,139 కోట్లకు పెరిగింది.
మొటార్ సైకిళ్ల అమ్మకాలు 2.47 లక్షల నుంచి 13 శాతం క్షీణించి 2.15 లక్షలకు తగ్గగా... స్కూటర్ల అమ్మకాలు మాత్రం 1.98 లక్షల నుంచి 2.23 లక్షలకు పెరిగాయి. త్రీ వీలర్ల అమ్మకాలు 21 వేల నుంచి 15 వేలకు పడిపోయాయి. త్వరలో కొత్త మోటార్‌సైకిల్‌ను, కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి తేనున్నామని కంపెనీ తెలియజేసింది. గతేడాది రూ.558 కోట్ల నికర లాభం: ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.489 కోట్లుగా ఉన్న నికర లాభం 2016–17 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం వృద్ధితో రూ.558 కోట్లకు పెరిగింది.