భారత్‌లో ట్వీటర్ టేకోవర్ బోణీ | Twitter to buy ZipDial in first Indian start-up acquisition | Sakshi
Sakshi News home page

భారత్‌లో ట్వీటర్ టేకోవర్ బోణీ

Published Wed, Jan 21 2015 2:45 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

భారత్‌లో ట్వీటర్ టేకోవర్ బోణీ - Sakshi

భారత్‌లో ట్వీటర్ టేకోవర్ బోణీ

* బెంగళూరు స్టార్టప్ జిప్‌డయల్ కొనుగోలు
* డీల్ విలువ రూ.247 కోట్లుగా అంచనా...
* భారత్‌లో వ్యాపారాభివృద్ధిపై మరింత దృష్టి...

న్యూఢిల్లీ: సోషల్ నెట్‌వర్క్ దిగ్గజం ట్వీటర్.. భారత్‌లో తొలిసారిగా కంపెనీల కొనుగోళ్లకు తెరతీసింది. బెంగళూరుకు చెందిన మొబైల్ మార్కెటింగ్ స్టార్టప్ జిప్‌డయల్‌ను చేజిక్కించుకుంది. తద్వారా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో వ్యాపారాన్ని, ఆదాయాలను పెంచుకోవడానికి బాటలు వేసుకుంటోంది.

ఈ కొనుగోలు విలువ ఎంతనేది ఇరు కంపెనీలూ  వెల్లడించనప్పటికీ.. 3-4 కోట్ల డాలర్ల(దాదాపు రూ.185-247 కోట్లు) మేరకు ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా.  ఈ కొనుగోలు ద్వారా భారత్‌లో తమ వ్యాపారం జోరందుకోవడంతోపాటు, వ్యూహాల అమలును వేగవంతం చేసేందుకు దోహదం చేస్తుందని ట్వీటర్ ఎండీ(ఇండియా, ఆగ్నేయాసియా) రిషి జైట్లీ చెప్పారు.
 
జిప్‌డయల్ సంగతిదీ...
వెలెరీ వేగనర్, అమియా పాథక్, సంజయ్ స్వామి... ఈ ముగ్గురూ 2010లో బెంగళూరు కేంద్రంగా దీన్ని ప్రారంభించారు. మొబైల్స్ ద్వారా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మధ్య యూజర్లకు వారధిగా పనిచేసేందుకు రూపొందించిన వినూత్న ప్లాట్‌ఫామ్ ఇది. ఎస్‌ఎంఎస్, వాయిస్, మొబైల్ వెబ్ వంటివాటినన్నింటినీ సమ్మిళితం చేస్తూ తగిన కంటెంట్‌ను మొబైల్ యూజర్లు దీనిద్వారా పొందొచ్చు.

యూజర్లు ఏదైనా ఒక బ్రాండ్‌కు సంబంధించిన నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు కంటెంట్‌ను అందుకునే వీలుంటుంది. ఎస్‌ఎంఎస్, వాయిస్ కాల్ లేదా యాప్ నోటిఫికేషన్ రూపంలో రియల్‌టైమ్‌లో సమాచారం పొందొచ్చు. పీఅండ్‌జీ, క్యాడ్‌బరీ, యూనిలీవర్, కోల్గేట్, కేఎఫ్‌సీ, మేక్‌మైట్రిప్ ఇలా వందలాది బ్రాండ్‌లను క్లయింట్లుగా కొనసాగిస్తున్న జిప్‌డయల్... ప్రస్తుతం దాదాపు 6 కోట్ల మంది యూజర్లతో అనుసంధానమైంది. ఈ సంస్థ ఉద్యోగుల సంఖ్య 50 మంది మాత్రమే.
 
మంచి లాభాలొచ్చాయి...: స్వామి
ఈ డీల్ ద్వారా భారతీయ స్టార్టప్స్‌కు శాన్‌ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీల్లో ప్రత్యేక గుర్తింపు లభించినట్లయిందని జిప్‌డయల్ సహ వ్యవస్థాపకుడు సంజయ్ స్వామి పేర్కొన్నారు. రీసెర్చ్ సంస్థ ఈ-మార్కెటెర్ అంచనాల ప్రకారం గత ఏడాది చివరినాటికి భారత్‌లో ట్వీటర్‌కు 1.81 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ప్రపంచంలో ఈ సంస్థకు మూడో అతిపెద్ద మార్కెట్‌గా కూడా భారత్ నిలుస్తోంది. కాగా, యూఎస్‌కు చెందిన ఈ కంపెనీకి ఉన్న మొత్తం 28.4 కోట్ల మందికిపైగా యూజర్లలో 70 శాతం మంది అమెరికా వెలుపలే ఉండటం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement