న్యూఢిల్లీ: బినాని సిమెంట్ వేలంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ బినాని సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. రుణాలు చెల్లించలేక డిఫాల్ట్ అయిన బినాని సిమెంట్‌ను రూ.7,266 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆల్ట్రాటెక్ సిమెంట్ పేర్కొంది.
బినాని సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి తాము రూ.6,350 కోట్ల బిడ్‌ను దాఖలు చేశామని, దీనికి రుణదాతల కమిటీ (సీఓసీ) అంగీకరించిందంటూ దాల్మియా సిమెంట్ వెల్లడించిన రోజుల్లోనే ఆల్ట్రాటెక్ రూ.7,266 కోట్ల ఆఫర్‌నివ్వడం విశేషం. రూ.6,350 కోట్ల ఆఫర్‌తో పాటు రుణదాతలకు బినాని సిమెంట్‌లో 20 శాతం వాటాను కూడా దాల్మియా సిమెంట్ ఆఫర్ చేసింది.
దివాలా ప్రక్రియ రద్దు చేయండి !
మరోవైపు తమ అనుబంధ సంస్థ, బినాని సిమెంట్స్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైన దివాలా ప్రక్రియను రద్దు చేయాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేయనున్నామని బినాని ఇండస్ట్రీస్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని బినాని సిమెంట్ పేర్కొంది. బినాని సిమెంట్‌లో తమకున్న 98.43% పూర్తివాటాను ఆల్ట్రాటెక్‌కు విక్రయించాలని నిర్ణయించామని కూడా పేర్కొంది.
బినాని సిమెంట్ రుణదాతల బకాయిలను తీర్చడానికి ఆల్ట్రాటెక్ భరోసానివ్వడంతో బినాని ఇండస్ట్రీస్ ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ నెల 14న జరిగిన రుణదాతల కమిటీ(సీఓసీ) భేటీలో బినాని సిమెంట్‌ను రూ.6,350 కోట్లకు కొనుగోలు చేయాలన్న దాల్మియా ఆఫర్‌ను సీఓసీ ఆమోదించింది. దాల్మియా ఆఫర్‌ను ఆమోదించిన ఈ భేటీ చెల్లదంటూ ఉత్తర్వులివ్వాలని గత వారమే ఎన్‌సీఎల్‌టీలో బినాని ఇండస్ట్రీస్ పిటీషన్‌ను దాఖలు చేసింది.
బినాని సిమెంట్ రుణ బకాయిలను తీర్చడానికి నిధులను అందించాలని బినాని సిమెంట్ కంపెనీ ప్రమోటర్ సంస్థ, బినాని ఇండస్ట్రీస్..తమను సంప్రదించిందని ఆల్ట్రాటెక్ పేర్కొంది. బినాని సిమెంట్‌లో 98.43% వాటా కొనుగోలు కోసం రూ.7,266 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆల్ట్రాటెక్ తెలిపింది. దివాళా ప్రక్రియ రద్దయి, ఇతర ఆమోదాలూ లభిస్తేనే ఇది సాకారమవుతుందని వివరించింది.
నాలుగో అతి పెద్ద సిమెంట్ కంపెనీ !
బినాని సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.25 మిలియన్ టన్నులు, ఇక ఆల్ట్రాటెక్ సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 92.5 మిలియన్ టన్నులు. ఆల్ట్రాటెక్ సిమెంట్ చేతికి బినాని సిమెంట్ వస్తే, ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో సిమెంట్ కంపెనీగా(చైనా మినహా) ఆల్ట్రాటెక్ సిమెంట్ అవతరిస్తుంది.
సగం బకాయిలు చెల్లిస్తాం.. వేలం ఆపండి: ఉత్తమ్ గాల్వా స్టీల్స్
మరో ఆసక్తికర పరిణామంలో తమ కంపెనీ ఆస్తుల వేలం విక్రయాన్ని ఆపాలని, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు బకాయి పడిన రూ.5,654 కోట్ల మొత్తంలో 51 శాతం చెల్లిస్తామని ఉత్తమ్ గాల్వ స్టీల్స్ ఆఫర్ చేసింది. ఈ మేరకు వన్ టైమ్ సెటిల్మెంట్‌కు అవకాశం ఇవ్వాలంటూ ఈ కంపెనీ ఈ నెల 15న ఎస్‌బీఐకు ఒక లేఖ రాసింది. ఉత్తమ్ గాల్వ స్టీల్స్‌కు రూ.5,644 కోట్ల మేర రుణాలిచ్చిన 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్‌బీఐదే అధిక వాటా. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.2,884 కోట్లు చెల్లిస్తామని, దివాల ప్రక్రియను నిలిపేయాలని ఉత్తమ్ గాల్వ స్టీల్స్ ఆ లేఖలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment