UltraTech Cement Company
-
అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి ఆదినారాయణరెడ్డి బెదిరింపులు
-
ఎమ్మెల్యే ఆదినారాయణ అరాచకం.. కలెక్టర్‌ను ఆశ్రయించిన అల్ట్రాటెక్
సాక్షి, వైఎస్సార్: జమ్మలమడుగులో పారిశ్రామికవేత్తలపై కూటమి నేతల అరాచకం మరింత పెరిగింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుల దాదాగిరి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి అరాచకంపై జిల్లా కలెక్టర్‌కు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.వివరాల ప్రకారం.. జమ్మలమడుగులో అన్ని కాంట్రాక్టులు తమకే కావాలంటూ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి కూటమి నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుల దాదాగిరి చేస్తున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతీ ఒక్క కాంట్రాక్టూ తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, ఇప్పటికే కాంట్రాక్టు నిర్వహిస్తున్న వారిని బయటకు పంపలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎమ్మెల్యే ఒత్తిడితో కొన్ని కాంట్రాక్టులు ఇచ్చినా ఆదినారాయణరెడ్డి వర్గం శాంతించలేదు. ఫ్యాక్టరీ ముడిసరుకు, సిమెంట్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను అడ్డుకున్నారు.సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సరుకు బయటకు వెళ్లకుండా బస్సులు అడ్డుపెట్టి మరీ అరాచకం సృష్టిస్తున్నారు. దీంతో, ఓ ప్లాంటులో ఉత్పత్తి ఆగిపోగా, మరో ప్లాంటులోనూ ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి అరాచకంపై కంపెనీ యాజమాన్యం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసు భద్రత ఏర్పాటు చేసింది జిల్లా యంత్రాంగం.అయితే, ఫ్యాక్షన్ పోకడలతో పారిశ్రామికవేత్తలను ఆదినారాయణరెడ్డి వేధిస్తున్నారు. మూడు నెలల క్రితం అదానీ పవర్ ప్లాంటుపైకి కూడా ఇదే విధంగాదాడి చేసిన ఆదినారాయణరెడ్డి వర్గం దాడి చేసింది. ఆర్టీపీపీ ఫ్లైయాష్ తరలింపులోనూ అంతా తామే చేయాలని రగడ సృష్టించింది. అప్పట్లో జేసీ వర్గంతో తలపడ్డ ఆదినారాయణరెడ్డి వర్గం.. జేసీ వాహనాలను అడ్డగించిన విషయం తెలిసిందే. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో జిల్లాకు పరిశ్రమలు రాకుండా పోతాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అల్ట్రాటెక్ వేల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ సామర్థ్య విస్తరణ బాట పట్టింది. దీనిలో భాగంగా ప్రస్తుత ప్లాంట్ల సామర్థ్య పెంపు, కొత్త యూనిట్ల ఏర్పాటును చేపట్టనుంది. ఇందుకు రూ. 12,886 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. తద్వారా 22.6 మెట్రిక్ టన్నుల వార్షిక(ఎంటీపీఏ) సామర్థ్యాన్ని జత చేసుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలిపింది. తాజాగా సమావేశమైన బోర్డు ఈ ప్రతిపాదనలను అనుమతించినట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ దిగ్గజం పేర్కొంది. భవిష్యత్ వృద్ధికి వీలుగా పెట్టుబడులను వెచ్చించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అల్ట్రాటెక్ 120 ఎంటీపీఏ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత విస్తరణలు పూర్తయితే కంపెనీ మొత్తం సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 159 ఎంటీపీఏను దాటనుంది. -
బినాని సిమెంట్‌ను కొంటాం
న్యూఢిల్లీ: బినాని సిమెంట్ వేలంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ బినాని సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. రుణాలు చెల్లించలేక డిఫాల్ట్ అయిన బినాని సిమెంట్‌ను రూ.7,266 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆల్ట్రాటెక్ సిమెంట్ పేర్కొంది. బినాని సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి తాము రూ.6,350 కోట్ల బిడ్‌ను దాఖలు చేశామని, దీనికి రుణదాతల కమిటీ (సీఓసీ) అంగీకరించిందంటూ దాల్మియా సిమెంట్ వెల్లడించిన రోజుల్లోనే ఆల్ట్రాటెక్ రూ.7,266 కోట్ల ఆఫర్నివ్వడం విశేషం. రూ.6,350 కోట్ల ఆఫర్‌తో పాటు రుణదాతలకు బినాని సిమెంట్‌లో 20 శాతం వాటాను కూడా దాల్మియా సిమెంట్ ఆఫర్ చేసింది. దివాలా ప్రక్రియ రద్దు చేయండి ! మరోవైపు తమ అనుబంధ సంస్థ, బినాని సిమెంట్స్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైన దివాలా ప్రక్రియను రద్దు చేయాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేయనున్నామని బినాని ఇండస్ట్రీస్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని బినాని సిమెంట్ పేర్కొంది. బినాని సిమెంట్‌లో తమకున్న 98.43% పూర్తివాటాను ఆల్ట్రాటెక్కు విక్రయించాలని నిర్ణయించామని కూడా పేర్కొంది. బినాని సిమెంట్ రుణదాతల బకాయిలను తీర్చడానికి ఆల్ట్రాటెక్ భరోసానివ్వడంతో బినాని ఇండస్ట్రీస్ ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ నెల 14న జరిగిన రుణదాతల కమిటీ(సీఓసీ) భేటీలో బినాని సిమెంట్‌ను రూ.6,350 కోట్లకు కొనుగోలు చేయాలన్న దాల్మియా ఆఫర్‌ను సీఓసీ ఆమోదించింది. దాల్మియా ఆఫర్‌ను ఆమోదించిన ఈ భేటీ చెల్లదంటూ ఉత్తర్వులివ్వాలని గత వారమే ఎన్సీఎల్టీలో బినాని ఇండస్ట్రీస్ పిటీషన్‌ను దాఖలు చేసింది. బినాని సిమెంట్ రుణ బకాయిలను తీర్చడానికి నిధులను అందించాలని బినాని సిమెంట్ కంపెనీ ప్రమోటర్ సంస్థ, బినాని ఇండస్ట్రీస్..తమను సంప్రదించిందని ఆల్ట్రాటెక్ పేర్కొంది. బినాని సిమెంట్‌లో 98.43% వాటా కొనుగోలు కోసం రూ.7,266 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆల్ట్రాటెక్ తెలిపింది. దివాళా ప్రక్రియ రద్దయి, ఇతర ఆమోదాలూ లభిస్తేనే ఇది సాకారమవుతుందని వివరించింది. నాలుగో అతి పెద్ద సిమెంట్ కంపెనీ ! బినాని సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.25 మిలియన్ టన్నులు, ఇక ఆల్ట్రాటెక్ సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 92.5 మిలియన్ టన్నులు. ఆల్ట్రాటెక్ సిమెంట్ చేతికి బినాని సిమెంట్ వస్తే, ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో సిమెంట్ కంపెనీగా(చైనా మినహా) ఆల్ట్రాటెక్ సిమెంట్ అవతరిస్తుంది. సగం బకాయిలు చెల్లిస్తాం.. వేలం ఆపండి: ఉత్తమ్ గాల్వా స్టీల్స్ మరో ఆసక్తికర పరిణామంలో తమ కంపెనీ ఆస్తుల వేలం విక్రయాన్ని ఆపాలని, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు బకాయి పడిన రూ.5,654 కోట్ల మొత్తంలో 51 శాతం చెల్లిస్తామని ఉత్తమ్ గాల్వ స్టీల్స్ ఆఫర్ చేసింది. ఈ మేరకు వన్ టైమ్ సెటిల్మెంట్కు అవకాశం ఇవ్వాలంటూ ఈ కంపెనీ ఈ నెల 15న ఎస్బీఐకు ఒక లేఖ రాసింది. ఉత్తమ్ గాల్వ స్టీల్స్‌కు రూ.5,644 కోట్ల మేర రుణాలిచ్చిన 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్బీఐదే అధిక వాటా. వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూ.2,884 కోట్లు చెల్లిస్తామని, దివాల ప్రక్రియను నిలిపేయాలని ఉత్తమ్ గాల్వ స్టీల్స్ ఆ లేఖలో పేర్కొంది. -
అల్ట్రాటెక్ సిమెంట్ లాభం రూ.780 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.780 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో సాధించిన నికర లాభం రూ.604కోట్లతో పోలిస్తే 29 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. అమ్మకాలు బాగా ఉండడం, వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా ఈ స్థాయిలో లాభాలు వచ్చాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.6,341 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.6,590 కోట్లకు పెరిగిందని తెలిపింది. అమ్మకాలు 6 శాతం వృద్దితో 12.57 మిలియన్ టన్నులకు పెరిగాయని, ఉత్పత్తి వ్యయం 7 శాతం తగ్గి రూ.3,643 కోట్లకు చేరిందని పేర్కొంది.