ఈ ఏడాది వృద్ధి 8.1 శాతం: ఐరాస
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు 2015లో 8.1% ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం, పటిష్ట వినియోగ డిమాండ్, మౌలిక ప్రాజెక్టుల అమలు, ప్రభుత్వ సంస్కరణల చొరవలు వంటి అంశాలు దీనికి కారణమని పేర్కొంది. ‘ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో 2015లో ఆర్థిక, సామాజిక పరిస్థితులు’ అన్న అంశంపై విడుదల చేసిన ఒక సర్వే నివేదికలో ఐక్యరాజ్యసమితి ఈ వివరాలను తెలిపింది. 2016లో భారత్ వృద్ధి రేటును 8.2 శాతంగా నివేదిక పేర్కొంది.
భారత్‌కు వస్తున్న ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీల వంటి పెట్టుబడుల్లో ఒడిదుడుకులు అలాగే అమెరికాలో వడ్డీరేట్లు పెంచే అవకాశాలు వంటివి భారత్ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను విసిరే అవకాశం ఉందని సైతం నివేదిక పేర్కొంది. భారత్‌సహా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందని వివరిస్తూ, ఇందుకు ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండడం కారణమని వివరించింది. భారత్‌లో సగానికి పైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో ఉత్పాదకత మరింత పెరగాల్సిన అవసరం ఉందని వివరించింది. ఇందుకు తగిన వ్యూహాలు రూపాందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.