మొబైల్ ఫోనే.. బ్యాంకు
♦ ‘జేబ్’ యాప్‌తో చెల్లింపులు సులభం
♦ సహకార సంఘాలూ ఆన్‌లైన్‌లోకి..
♦ వీసాఫ్ట్ సీవోవో శ్రీనివాస్ ద్రోణంరాజు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సాంకేతికంగా చెల్లింపుల విధానాల్లో విప్లవాత్మక మార్పులొస్తున్న నేపథ్యంలో చేతిలో ఉండే స్మార్ట్‌ఫోనే బ్యాంకుగా మారిపోతోందని వీసాఫ్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) శ్రీనివాస్ ద్రోణంరాజు అభిప్రాయపడ్డారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్), యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వంటివి దీనికి గణనీయమైన తోడ్పాటునందిస్తున్నట్లు చెప్పారాయన. ఈ తరహా విధానాలకు అనుగుణంగా తాము రూపొందించిన ‘జేబ్’ యాప్...
చెల్లింపులను మరింత సులభతరం చేస్తుందన్నారు. చెల్లింపులకు మాత్రమే పరిమితం కాకుండా వినియోగదారు తన వ్యయాల సరళి తెలుసుకునేందుకు, ఆర్థిక ప్రణాళికలను తనకు తగ్గట్లుగా సవరించుకునేందుకు తోడ్పడేలా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. ‘‘ల్యాప్‌టాప్, ఫోన్, ట్యాబ్లెట్ తదితర పరికరాలన్నింటిలోనూ బ్యాంకు వెబ్‌సైట్ స్వరూపం ఒకే తరహాలో ఉండి, లావాదేవీలను సులభతరంగా నిర్వహించుకునే వెసులుబాటునిచ్చే డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అందిస్తున్నామని వివరించారు.
సహకార బ్యాంకుల సొల్యూషన్స్‌పై దృష్టి ..
ప్రధానంగా సహకార బ్యాంకులకు అవసరమైన బ్యాంకింగ్ సొల్యూషన్స్‌పై తాము దృష్టి పెడుతున్నట్లు శ్రీనివాస్ చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (ప్యాక్స్) కంప్యూటరీకరించి, జిల్లా బ్యాంకులకు అనుసంధానం చేయడం ద్వారా వాటిలో సభ్యత్వమున్న రైతులను కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చేసే దిశగా కసరత్తు జరుగుతోందన్నారు. దీనితో 54 లక్షల మంది పైచిలుకు రైతులు బ్యాంకింగ్ పరిధిలోకి వస్తారు. అలాగే, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయ రుణాలను రైతులు మరింత సమర్ధంగా వినియోగించుకునే విధంగా కిసాన్ లోన్ సిస్టమ్ సొల్యూషన్‌ను రూపొందించామన్నారు. పక్కా గణాంకాల లభ్యత కారణంగా ప్రభుత్వాలు కూడా తగిన నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని తెలియజేశారు. వచ్చే అయిదేళ్లలో మరో 1,500 మందిని నియమించుకోనున్నట్లు తెలిపారు.