కింగ్‌ఫిషర్‌ను కూల్చారు.. జెట్‌ను గట్టెక్కిస్తున్నారు | Vijay Mallya attacks banks over Jet Airways bailout | Sakshi
Sakshi News home page

కింగ్‌ఫిషర్‌ను కూల్చారు.. జెట్‌ను గట్టెక్కిస్తున్నారు

Published Wed, Mar 27 2019 12:01 AM | Last Updated on Wed, Mar 27 2019 4:52 AM

Vijay Mallya attacks banks over Jet Airways bailout - Sakshi

న్యూఢిల్లీ: మాజీ లిక్కర్‌ కింగ్, వ్యాపారవేత్త విజయ్‌మాల్యా బ్యాంకుల ద్వంద్వ ప్రమాణాలపై మండిపడ్డారు. ఒకప్పుడు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్దాక్షిణ్యంగా విఫలమయ్యేందుకు కారణమైన బ్యాంకులు... ఇప్పుడు అదే విధమైన పరిస్థితిలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను మాత్రం ఒడ్డెక్కిస్తున్నాయని ఎత్తిచూపారు. సమస్యల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ తన నియంత్రణలోకి తీసుకోవడంపై వరుస ట్వీట్లతో మాల్యా తన స్పందన తెలియజేశారు. కింగ్‌ఫిషర్‌ విషయంలోనూ ఇదే జరగాల్సి ఉందన్నారు. ‘‘పీఎస్‌యూ బ్యాంకులు జెట్‌ఎయిర్‌వేస్‌కు బెయిలవుట్‌ కల్పించడం, ఉద్యోగాలను, సేవల కనెక్టివిటీని కాపాడడం చూడ్డానికి ఆనందంగా ఉంది. ఇవే పీఎస్‌యూ బ్యాంకులు భారత్‌లోనే అత్యుత్తమమైన ఎయిర్‌లైన్‌ (కింగ్‌ఫిషర్‌), మెరుగైన ఉద్యోగులు, అనుసంధానత ఉన్న దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేశాయి’’ అని మాల్యా ట్వీట్‌ చేశారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను నిలబెట్టేందుకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తించలేదని, బదులుగా అన్ని ద్వారాలను మూసేశారని ఆక్షేపించారు. కంపెనీని, ఉద్యోగులను కాపాడేందుకు కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో తాను రూ.4,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేసినట్టు మాల్యా చెప్పారు. జెట్‌ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ విషయంలో భిన్న విధానాన్ని అనుసరించడం పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కారును విమర్శించారు. ‘‘నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నేను రాసిన లేఖలను బీజేపీ అధికార ప్రతినిధి అనర్గళంగా చదువుతారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో పీఎస్‌ యూ బ్యాంకులు అక్రమంగా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు సహకరించాయని చెబుతారు. మరి ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం హయాంలో ఏం మారిపోయిందన్నది ఆసక్తి కలిగిస్తోంది’’ అని మాల్యా విమర్శించారు. 

నా డబ్బులు తీసుకోండి...
‘‘పీఎస్‌యూ బ్యాంకులు, ఇతర రుణదాతలకు చెల్లించేందుకు గాను కర్ణాటక హైకోర్టు ముందు నా లిక్విడ్‌ ఆస్తులను (వెంటనే నగదుగా మార్చుకునేవి) ఉంచాను. వాటిని తీసుకోవాలని మరోసారి అభ్యర్థిస్తున్నాను. బ్యాంకులు నా డబ్బులను ఎందుకు తీసుకోవడం లేదు? జెట్‌ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు ఇవి ఉపయోగపడతాయి’’ అని తన ట్వీట్‌లో మాల్యా పేర్కొన్నారు. బ్యాంకులకు మాల్యా రూ.9,000 కోట్లకు పైగా రుణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. బ్రిటన్‌లో ఉన్న ఆయన్ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రూ.8,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించలేక, అదే సమయంలో కార్యకాలాపాల నిర్వహణకు నిధుల్లేక మునిగిపోయే పరిస్థితికి చేరిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ ఓ పరిష్కార ప్రణాళికను రూపొందించిన విషయం గమనార్హం. బ్యాంకులు తమ రుణాలను జెట్‌ఎయిర్‌వేస్‌లో వాటాల కింద మార్చుకుని తమ అధీనంలోకి తీసుకునేందుకు నిర్ణయించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement