మార్కెట్లోకి వోల్వో ఎస్60 పోల్‌స్టార్ సెడాన్
► ధర రూ.52.5 లక్షలు
► 4.7 సెకన్లలోనే 0–100 కిమీ. వేగం
► గరిష్ట వేగం గంటకు 250 కి.మీ
కోయంబత్తూర్: స్వీడన్‌కు చెందిన వోల్వో కార్స్ కంపెనీ... వోల్వో ఎస్60 పోల్‌స్టార్ సెడాన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు పరిచయ ధర రూ.52.5 లక్షలు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని వోల్వో ఆటో ఇండియా తెలిపింది. 0–100 కిమీ. వేగాన్ని 4.7 సెకన్లలోనే అందుకునే ఈ కారు గరిష్ట వేగం గంటకు 250కిమీ.అని వోల్వో ఆటో ఇండియా ఎండీ టామ్ వాన్ బాన్స్‌డార్ఫ్ పేర్కొన్నారు.
భారత్‌లో అందిస్తున్న వోల్వో కార్లలో అత్యంత వేగంగా ప్రయాణించే కారు ఇదే. 2–లీటర్, ట్విన్ చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌తో దీన్ని రూపొందించామని వివరించారు. ఎస్60 పోల్‌స్టార్‌తో లగ్జరీ సెగ్మెంట్‌లో పూర్తి స్థాయి రేంజ్‌లో కార్లను అందిస్తున్నామన్నారు. ఇది మెర్సిడెస్ సి43 ఏఎంజీ, సీఎల్‌ఏ45 ఏఎంజీ, ఆడి ఎస్5 కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
రెండంకెల వృద్ధి లక్ష్యం..: గత ఏడాది 1,600 కార్లు విక్రయించామని టామ్ వాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది 2,000 కార్లు విక్రయించాలని, అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. పోల్‌స్టార్ ఒక మోటార్‌స్పోర్ట్ టీమ్‌గా 1996లో ఏర్పాటైంది. దీనిని వోల్వో కార్స్ కంపెనీ 2015లో కొనుగోలు చేసింది. ఆ తర్వాత పెర్ఫామెన్స్ బ్రాండ్‌గా పోల్‌స్టార్‌ను వోల్వో కార్స్ మార్చివేసింది.