21న వండర్‌లా పబ్లిక్ ఇష్యూ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కోచి, బెంగళూరులలో అమ్యూజ్‌మెంట్ పార్కులను నిర్వహిస్తున్న వండర్‌లా హాలిడేస్ లిమిడెట్ హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం వద్ద రూ.250 కోట్లతో కొత్త ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆ సంస్థ ఎండీ అరుణ్ చిట్టిలప్పిల్లి వెల్లడించారు. ఈ నెల 21న రూ.10 ముఖ విలువ కలిగిన 1.45 కోట్ల ఈక్విటీ వాటాలను రూ.115-125 ప్రైస్ బ్యాండ్‌తో పబ్లిక్ ఇష్యూ జారీ చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే 25 ఎకరాల్లో అమ్యూజ్‌మెంట్ పార్కు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయయని, రెండేళ్లలో దీనిని పూర్తి చేస్తామని వివరించారు. ఈ పార్కులో 45 రైడ్స్‌తో పాటు వాటర్, థీమ్ పార్కులు ఉంటాయన్నారు. ఇష్యూ ఈ నెల 23న ముగుస్తుందన్నారు. దీని ద్వారా సేకరించిన మొత్తాన్ని హైదరాబాద్ ప్రాజెక్టుపైనే ఖర్చు చేస్తామని చెప్పారు. ఇప్పటికే రూ.36 కోట్లు ఖర్చు చేశామని, మిగిలిన మొత్తాన్ని రుణ దాతల ద్వారా సేకరిస్తామని ఆయన వివరించారు.