ప్రపంచ స్థాయి భారతీయ బ్రాండ్లు రూపొందిస్తాం
న్యూఢిల్లీ: 2030 నాటికి ఎఫ్‌ఎంసీజీ విభాగం ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఐటీసీ ప్రపంచ స్థాయి భారతీయ బ్రాండ్ల రూపకల్పనపై దృష్టి సారించింది. క్లాస్‌మేట్స్, సన్‌ఫీస్ట్, ఆశీర్వాద్ బ్రాండ్ల విజయం ఇచ్చిన ఉత్సాహంతో... ప్రస్తుత విభాగాలతో పాటు తాజా పండ్లు, కూరగాయలు, సముద్ర ఉత్పత్తుల వంటి నూతన విభాగాల్లోకి విస్తరించే లక్ష్యాలతో ఉంది. ప్రస్తుతం క్లాస్‌మేట్స్, సన్‌ఫీస్ట్, ఆశీర్వాద్ బ్రాండ్లు రూ.1,000 నుంచి రూ.3,000 కోట్ల ఆదాయ స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ స్థాయి భారతీయ బ్రాండ్లతోపాటు, ఈ దేశానికి మేధో పరమైన ఆస్తులు సృష్టించాలన్నదే తమ అభిలాష అని ఐటీసీ సీఈవో సంజీవ్‌పూరి తెలిపారు.
ఈ లక్ష్యం దిశగా తమ పని ప్రారంభించినట్టు చెప్పారు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగం నుంచి ఆహారం, విద్య, స్టేషనరీ, అగర్‌బత్తి వరకు అన్నింటా ప్రపంచ స్థాయి ఉత్పాదనలు రూపొందించడం ద్వారా తమ లక్ష్యాలను చేరుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుత విభాగాల్లో బలోపేతం కావడమే కాకుండా నూతన విభాగాల్లోకీ ప్రవేశిస్తామన్నారు. 2015–16లో ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ మొత్తం ఆదాయం రూ.28.410 కోట్లుగా ఉండగా ఇందులో ఒక్క సిగరెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.18,686 కోట్లు. వచ్చే కొన్నేళ్లలో ఎఫ్‌ఎంసీజీ విభాగంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడి ద్వారా 2030 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని చేరుకుంటామని ఐటీసీ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే.
మాకు ఎన్నో బలాలున్నాయ్...
ఎఫ్‌ఎంసీజీ విభాగంలో గట్టి పోటీనిచ్చేందుకు తమకు ఎన్నో బలాలున్నాయని పూరి తెలిపారు. భారీ స్థాయిలో అగ్రి వ్యాపార విభాగం, పాక శాస్త్ర నిపుణులు, సంప్రదాయ బ్రాండ్ విలువ, మార్కెటింగ్ తదితరమైనవి తమ బలాలుగా పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ విభాగంలో ఇప్ప టి వరకు 350 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు. ఈ బలాలతో ఎఫ్‌ఎంసీజీ రంగంలో వేగంగా వృద్ధి చెందగలమనే ఆశాభావాన్ని ఆయ న వ్యక్తం చేశారు. ఐటీసీకి 25 బ్రాండ్లు ఉన్నాయ ని, కొన్నింటిలో నంబర్1, కొన్నింటిలో నంబర్ 2, 3 స్థానాల్లో ఉండగా... అన్నింటా నంబర్ 1 స్థానానికి చేరుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు.