విశాఖలో జిరాక్స్ కేంద్రం
సాక్షి, అమరావతి: జిరాక్స్ కంపెనీ విశాఖపట్నంలో సొంత క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. తగినంత భూమి కేటాయిస్తే 5,000 మందికి ఉపాధి కల్పించేలా క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి జిరాక్స్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో చర్చించారు. సొంత భూమి కేటాయించే వరకూ మధురవాడలో నిర్మిస్తున్న మిలీనియం టవర్‌లో కార్యకలాపాలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. భూమి కేటాయిస్తే, తక్షణం 500 మందికి ఉపాధి కల్పించే విధంగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ నెలాఖరుకల్లా ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలిపింది.