పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి ఏడాది. ఏడాది గడుస్తున్నా.. నోట్ల రద్దు అనంతరం మార్కెట్‌లోకి వచ్చిన కొత్త రూ.2000 నోటు మాత్రం ఇంకా ప్రజల మన్ననలను పొందలేకపోతుంది. ఇప్పటికీ ఈ నోటును తిరస్కరిస్తూనే ఉన్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. చిన్న చిన్న లావాదేవీలకు ముఖ్యంగా రోజువారీ కార్యకలాపాలకు ఈ నోటు వాడకం కష్టతరంగా ఉందని తెలిపారు. గతేడాది నవంబర్ 8 రాత్రి ప్రధాని నరేంద్రమోదీ హఠాత్తుగా పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల రద్దు అనంతరం కొన్ని నెలల వరకు బ్యాంకింగ్ కార్యకలాపాలు చాలా క్లిష్టతరంగా మారాయి. పెద్ద నోట్లను కొత్త నోట్ల రూపంలో మార్చుకోవడానికి ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ఒక్క ప్రజలే కాక, ఇటు బ్యాంకింగ్ సిబ్బంది కూడా రాత్రింబవళ్లు పనిచేసిన రోజులున్నాయి. ప్రస్తుతం పరిస్థితి కాస్త సద్దుమణిగింది. కానీ ఇప్పటికీ నోట్ల రద్దు అనంతరం ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన కొత్త నోటు రూ.2000కు మాత్రం ఎలాంటి ఆదరణ లభించడం లేదు.
'' ప్రజలు ఇప్పటికీ రూ.2000 నోటును ఇష్టపడటం లేదు. చిన్న కరెన్నీ నోట్లు రూ.500, రూ.200, రూ.100ను మాత్రమే వారు కోరుకుంటున్నారు. కానీ డిమాండ్‌కు తగ్గట్టు వీటి సరఫరా లేదు'' అని మహాగుజరాత్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జనక్ రావల్ చెప్పారు. అయితే ఎక్కువ మొత్తంలో నగదును విత్‌డ్రా చేసుకునేటప్పుడు ఎక్కువగా ఏటీఎంల నుంచి రూ.2000 డినామినేషన్ నోట్లే వస్తున్నాయని, ఆ సమయంలో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో చిన్న మొత్తాలు కూడా ప్రజలకు ఎక్కువగా అందుబాటులోకి రావడం లేదు. చిన్న మొత్తాలను విత్‌డ్రా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ విత్‌డ్రాలపై బ్యాంకులు పరిమితులు విధించి ఛార్జీలు విధించడం మరో సమస్యగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment