పాత ధరల్లోనే గ్యాడ్జెట్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్
ఢిల్లీ : దేశమంతా ఒకే పన్ను విధానం జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేసింది. జూలై 1 నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చినప్పటికీ, చాలామంది చిన్న మొబైల్ రిటైలర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు ఇంకా ప్రీ-జీఎస్టీ ధరల్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. పాత ఇన్వెంటరీని క్లియర్ చేసుకునేందుకు లేదా కొత్త పన్ను విధానంలోకి మారేందుకు సన్నద్ధంగా లేకపోవడంతో ఈ రిటైలర్లు బ్యాక్‌డేటెడ్ బిల్లుల ద్వారా వీటిని విక్రయిస్తున్నట్టు తెలిసింది. జీఎస్టీ రేట్లతో కొత్త స్టాక్ వచ్చేంతవరకు అంటే వచ్చే రెండు మూడు రోజుల వరకు ఈ బ్యాక్‌డేటెడ్ బిల్లింగ్ ద్వారానే రిటైలర్లు విక్రయాలు చేపడతారని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రి అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లో గందరగోళ వాతావరణం ఏర్పడిందని, కొత్త పన్ను విధానంలోకి మారడానికి అందరూ రిటైలర్లు సిద్ధంగా లేరని ఓ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీదారి సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను బిల్లింగ్ సిస్టమ్స్ చేయాల్సి ఉందని, దానికి మరికొంత సమయం పడుతుందన్నారు.
అంతేకాక ఎవరైతే పాత స్టాక్‌ను ఎక్కువగా కలిగిఉన్నారో వారికి కూడా నష్టాలు వస్తున్నాయని చెప్పారు. కేవలం 30-60 రోజలు స్టాక్‌కు మాత్రమే పరిహారం ఇవ్వడానికి కంపెనీలు సిద్దమవుతున్నాయని తెలిపారు. జీఎస్టీ అమలుతో చాలా ఉత్పత్తులపై ధరలు పెరిగాయి. ధరలు పెరుగుతాయనే భయాందోళనతో చాలామంది వినియోగదారులు కూడా ముందస్తుగానే ఉత్పత్తులను కొనుగోళ్లు చేశారు. దీంతో శనివారం నుంచి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ స్టోర్లు బోసిపోయాయి. జీఎస్టీతో పన్ను రేట్లు పెరుగడంతో ఈ నెల ప్రారంభం నుంచి తమ విక్రయాలు 60 శాతం పైగా పడిపోయాయని జువెల్లరీ వర్తకులు చెప్పారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండీషనర్ల షాపులదే ఇదే పరిస్థితి. వీటిపై పన్ను రేట్లు 26 శాతం నుంచి 28 శాతానికి పెరిగాయి. దీంతో బ్యాక్‌డేటెడ్ బిల్లుతో రిటైలర్లు విక్రయాలు చేపడుతున్నారు.