consumer electronics
-
భారత్‌లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్‌తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్‌లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్‌ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్‌లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
బోట్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు అదరహో.. రూ.4,000 కోట్ల టర్నోవర్
న్యూఢిల్లీ: ఆడియో, వేరబుల్స్ బ్రాండ్ బోట్ 2022–23లో రూ.4,000 కోట్ల నికర అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ‘కొన్నేళ్లుగా స్థానిక భారతీయ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాం. ఆడియో, వేరబుల్స్ ఉత్పత్తులను డిక్సన్‌తో సహా అనేక కంపెనీలు దేశీయంగా తయారు చేస్తున్నాయి. డిక్సన్‌తో జేవీ కూడా ఏర్పాటు చేశాం’ అని బోట్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 2,870 కోట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపు 40 శాతం పెరిగింది. సొంత ఆర్ అండ్ డీ సదుపాయం, బోట్ ల్యాబ్స్‌ను గతేడాదే కంపెనీ ఏర్పాటు చేసింది. గత సంవత్సరం కొలుగోలు చేసిన సింగపూర్‌కు చెందిన సొల్యూషన్స్ ప్లాట్‌ఫామ్ ‘కాహా’ సహకారంతో స్మార్ట్, హోలిస్టిక్ వెల్నెస్ ఎకోసిస్టమ్‌ను రూపొందించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
‘ప్రీమియం ఉత్పత్తులకు’ సై!
న్యూఢిల్లీ: పండుగల విక్రయాలు జోరుగా సాగాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీల అంచనాలను మించి అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రీమియం (ఖరీదైన), మధ్య శ్రేణి ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు విక్రయాలకు అడ్డుపడకపోవడం వాటిని ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ ఏడాది పండుగల సీజన్లో విక్రయాలు విలువ పరంగా 30 శాతం, సంఖ్యా పరంగా 20 శాతం వృద్ధిని చూసినట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రకటించింది. ‘‘ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మంచిగా సాగాయి. మధ్యశ్రేణి నుంచి ఖరీదైన ఉత్పత్తుల వరకే చూస్తే అమ్మకాల్లో 30 శాతం, విలువలో 40–50 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా పండుగల చివరి మూడు రోజుల్లో ఎక్కువ డిమాండ్ కనిపించింది’’అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. కానీ, ఆరంభ ధరల్లోని ఉత్పత్తుల అమ్మకాలు ఈ పండుగల సీజన్లో 10–15 శాతం తగ్గినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒత్తిళ్లు ఒక కారణం అయితే, కొందరు వినియోగదారులు ఆరంభ స్థాయి నుంచి తదుపరి గ్రేడ్ ఉత్పత్తులకు మారిపోవడం మరో కారణమని వివరించారు. ఖరీదైన వాటికి ఆదరణ.. ఖరీదైన గృహోపకరణాలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్యానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా ఎండీ ఫుమియసు ఫుజిమోరి తెలిపారు. ఈ పండుగ సీజన్లో ఏసీలు, పెద్ద తెరల టీవీలు, హోమ్ అప్లయన్సెస్ విక్రయాలు డబులు డిజిట్లో పెరుగుతాయన్న అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ‘‘విలువ పరంగా చూస్తే ఇన్వెస్టర్ ఏసీల అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదైంది. ఎల్ఈడీ టీవీల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. 4కే టీవీల అమ్మకాల్లో అయితే ఏకగా 34 శాతం వృద్ధి కనిపించింది. టాప్లోడ్ వాషింగ్ మెషిన్లలో 13 శాతం అధిక వృద్ధి నమోదైంది’’అని ఫుజిమోరి వివరించారు. విద్యుత్‌ను ఆదా చేసే ఏసీలు, వినియోగం సులభంగా ఉండే ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ వృద్ధి ఇలాగే స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో అధిక వృద్ధి ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హెచ్‌యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా స్పందిస్తూ.. సెప్టెంబర్ త్రైమాసికంలో విక్రయాలు ఇటీవలి కాలంలోనే ఎక్కువగా నమోదైనట్టు చెప్పారు. దీపావళి తర్వాత విక్రయాల తీరును కూడా గమనించాల్సి ఉంటుందన్నారు. తక్కువ ధరల వాటితో పోలిస్తే ప్రీమియం ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు పాపులర్ బ్రాండ్ల కంటే మించి ఉన్నాయి. అలాగే, చౌక ఉత్పత్తులతో పోలిస్తే పాపులర్ ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి’’అని సంజీవ్ మెహతా వివరించారు. ప్రీమియం విభాగంలో వృద్ధి ఎక్కువగా ఉండడం ప్రజల వద్ద ఖర్చు పెట్టే ఆదాయం పెరిగిందనడానికి సూచనగా పేర్కొన్నారు. -
మార్కెట్లోకి ఎల్జీ కొత్త ఉత్పత్తుల శ్రేణి
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఇండియా తాజాగా 2022కి సంబంధించి కొత్త ఉత్పత్తుల శ్రేణిని ఆవిష్కరించింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఒవెన్లు, ఏసీలు మొదలైన వాటికి సంబంధించి 270 పైగా మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ గృహోపకరణాలు వీటిలో ఉన్నాయి. ఏఐ డైరెక్ట్ డ్రైవ్ వాషింగ్ మెషీన్లు, ఇన్‌స్టావ్యూ ఫ్రిజ్‌లు, ప్యూరికేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫయర్, విరాట్ ఏసీలు మొదలైనవి వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయని సంస్థ డైరెక్టర్ (హోమ్ అప్లయెన్స్, ఎయిర్ కండీషనర్స్) హ్యూంగ్ సుబ్జీ తెలిపారు. ఈ ఏడాది 2022లో 30 శాతం వృద్ధి సాధించగలమని అంచనా వేస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. పటిష్ట డిమాండ్, కొత్త ప్రొడక్టుల విడుదల నేపథ్యంలో హోమ్ అప్లయెన్సెస్, ఏసీ బిజినెస్ వేగవంత పురోగతిని సాధించే వీలున్నట్లు పేర్కొంది. గతేడాది (2021) ఈ విభాగాలలో 20% వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. దేశీయంగా అమ్మకాలలో 70% వాటా ఈ విభాగానిదేనని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ పేర్కొన్నారు. 2021లో ఈ విభాగం అమ్మకాలు రూ. 15,000 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించారు. -
కూల్ కావాలంటే పర్స్ ఖాళీనే
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం తొలి రోజుల్లోనే ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన వినియోగ ఉత్పత్తుల రేట్లు.. కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ముడి వస్తువుల వ్యయాలు, రవాణా చార్జీలు పెరిగిపోవడంతో కంపెనీలు ఆ భారాన్ని కొనుగోలుదారులకు బదలాయిస్తున్నాయి. ఈ నెలాఖరులో లేదా మార్చి ఆఖరు నాటికి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి ఉత్పత్తుల రేట్లు 5–10 శాతం మేర పెంచబోతున్నాయి. పానసోనిక్, ఎల్జీ, హయర్ వంటి సంస్థలు ఇప్పటికే పెంచగా.. సోనీ, హిటాచీ, గోద్రెజ్ అప్లయెన్సెస్ మొదలైనవి ఈ త్రైమాసికం ఆఖరు నాటికి నిర్ణయం తీసుకోనున్నాయి. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) నివేదిక ప్రకారం జనవరి–మార్చి వ్యవధిలో ధరలు 5–7 శాతం మేర పెరగనున్నాయి. ‘కమోడిటీల ధరలు, అంతర్జాతీయంగా రవాణా, ముడి వస్తువుల రేట్లు అసాధారణంగా పెరిగిపోవడంతో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు వంటి ఉత్పత్తుల రేట్లను 3–5 శాతం పెంచేందుకు మేము చర్యలు తీసుకున్నాం‘ అని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. ఏసీల రేట్లు ఇప్పటికే 8 శాతం వరకూ పెంచిన పానసోనిక్ .. ధరలను మరింత పెంచే యోచనలో ఉంది. ఇతర గృహోపకరణాల రేట్లను పెంచే అంశం పరిశీలిస్తోంది. ‘ఏసీల రేట్లు 8 శాతం వరకూ పెరిగాయి. కమోడిటీల వ్యయాలు, సరఫరా వ్యవస్థ పరిస్థితులు బట్టి ఇవి మరింత పెరగవచ్చు. సమీప భవిష్యత్తులో గృహోపకరణాల రేట్ల పైనా ప్రభావం పడే అవకాశం ఉంది‘ అని పానసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫ్యుజిమోరి తెలిపారు. దేశీ గృహోపకరణాలు, కన్జూమర్ డ్యూరబుల్ పరిశ్రమ పరిమాణం రూ. 75,000 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. పండుగ సీజన్లో వాయిదా.. పండుగల సీజన్ కావడంతో రేట్ల పెంపును కంపెనీలు వాయిదా వేస్తూ వచ్చాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ‘అయితే, ప్రస్తుతం భారాన్ని కస్టమర్లకు బదలాయించడం తప్ప తయారీ సంస్థలకు వేరే మార్గం లేకుండా పోయింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ధరల పెంపు 5–7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు రేట్లు పెంచేయగా మరికొన్ని దానికి సంబంధించిన ప్రక్రియలో ఉన్నందున పెంపు పరిమాణం వివిధ రకాలుగా ఉండొచ్చని బ్రగాంజా చెప్పారు. అయితే, డిమాండ్ మందగించినా, ముడి వస్తువుల ధరలు తగ్గినా .. ఏప్రిల్ లేదా మే లో రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. సోనీ ఇండియా, గోద్రెజ్ అప్లయెన్సెస్ వంటి సంస్థలు రేట్ల పెంపుపై తాము ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో పెరిగే అవకాశాలు ఉన్నాయని థామ్సన్, కోడక్ వంటి బ్రాండ్ల తయారీ సంస్థ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ (ఎస్పీపీఎల్) సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా తెలిపారు. మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నామని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకుంటామని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ (దైవా, షింకో తదితర బ్రాండ్స్ తయారీ సంస్థ) తెలిపింది. తప్పని పరిస్థితి.. ధరల భారాన్ని వీలైనంత వరకూ తామే భరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని, కానీ వ్యాపారం నిలదొక్కుకునేందుకు పెంపు తప్పటం లేదని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ పన్నసల్ తెలిపారు. రేట్ల పెంపు తప్పదని జాన్సన్ కంట్రోల్స్–హిటాచీ ఎయిర్ కండీషనింగ్ ఇండియా సీఎండీ గుర్మీత్ సింగ్ తెలిపారు. ముడివస్తువులు, పన్నులు, రవాణా వ్యయాలు మొదలైనవి పెరిగిపోవడం వల్ల ఏప్రిల్ నాటికి బ్రాండ్లు దాదాపు 10% వరకూ ధరలు పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘ఏప్రిల్ వరకూ దశలవారీగా ధరల పెంపు కనీసం 8–10% మేర ఉండవచ్చు. గతేడాది కూడా ఇదే విధంగా 6–7% వరకూ పెరిగాయి. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, అల్యూమినియం .. రిఫ్రిజిరెంట్స్ వంటివాటిపై యాంటీ డంపింగ్ సుంకాల విధింపుతో రేట్లు మరో 2–3 శాతం పెరగవచ్చు‘ అని సింగ్ వివరించారు. -
స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో (జీఐఎఫ్) స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు గణనీయంగా డిమాండ్ నెలకొందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ వెల్లడించారు. వన్‌ప్లస్, శాంసంగ్, యాపిల్, షావోమీ తదితర సంస్థల ఉత్పత్తులు భారీగా అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. ఈసారి జీఐఎఫ్‌కు మరింత స్పందన లభిస్తోందని, ప్రారంభమైన తొలి 48 గంటల్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని ఆయన తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు సంబంధించి 5,000 పైచిలుకు విక్రేతలు పాల్గొన్నారని తివారీ చెప్పారు. గతేడాది ఫెస్టివల్ సేల్ మొత్తం మీద అమ్ముడైన ఐఫోన్లకు మించి ఈసారి ఒక్కరోజులోనే అమ్ముడవడం గమనార్హమని తివారీ తెలిపారు. నవంబర్ 13 దాకా జరిగే ‘ఫినాలే డేస్’ సందర్భంగా భారీ ఉపకరణాలు, టీవీలపై 75 శాతం దాకా, గృహోపకరణాలపై 80 శాతం దాకా, స్మార్ట్ఫోన్లపై 40 శాతం దాకా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వివరించారు. అలాగే, కనీస ఆర్డర్ పరిమితికి లోబడి ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంటు ఉంటుందని తెలిపారు. పెరిగిన విక్రేతలు.. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గతంతో పోలిస్తే కొత్త విక్రేతల రిజిస్ట్రేషన్ల సంఖ్య 50 శాతం పెరిగిందని తివారీ వివరించారు. వ్యక్తిగత గ్రూమింగ్ ఉత్పత్తులు, స్టడీ ఫ్రం హోమ్‌కి అవసరమైన ఉత్పత్తులు, గృహోపకరణాలు మొదలైన వాటికి ఆర్డర్లు గణనీయంగా వస్తున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో డిమాండ్‌కి అనుగుణంగా వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను డెలివర్ చేయడానికి అమెజాన్ భారీ సన్నాహాలు చేసిందని తివారీ చెప్పారు. కొత్తగా దాదాపు 200 డెలివరీ స్టేషన్లు, వేలకొద్దీ డెలివరీ పార్ట్నర్స్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న 8 స్టోర్ సెంటర్లను విస్తరించడంతో పాటు మరో అయిదింటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పండుగ సీజన్ నేపథ్యంలో సుమారు 1,00,000 పైచిలుకు సీజనల్ ఉపాధి అవకాశాలు కల్పించగలిగామని చెప్పారు. -
నౌకాశ్రయం ఉన్న చోటే ఓరియంట్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీకే బిర్లా గ్రూప్‌కు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఓరియంట్ ఎలక్ట్రిక్ దక్షిణాదిలో నూతన ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇప్పటికే బోర్డ్ ఆమోదం పూర్తయిందని, ఎగుమతులకు వీలుగా ఉండే నౌకాశ్రయం ఉన్న రాష్ట్రంలోనే గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించామని కంపెనీ సీఈఓ రాకేష్ ఖన్నా తెలిపారు. స్థానిక ప్రభుత్వ విధానాలు, కార్మికుల నైపుణ్యత, అందుబాటులో స్థల లభ్యత వంటివి ప్లాంట్ ఏర్పాటులో ప్రధాన అంశాలని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్లాంట్‌లో తొలి దశలో ఫ్యాన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని, ఆ తర్వాత ఎయిర్ కూలర్లు, ఇతర గృహోపకరణాల తయారీ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఓరియంట్ ఎలక్ట్రిక్‌కు కోల్‌కతా, ఫరీదాబాద్, నోయిడా, గౌహతీలో నాలుగు ప్లాంట్లున్నాయి. 40 అంతర్జాతీయ మార్కెట్లకు ఫ్యాన్లను ఎగుమతి చేస్తుంది. మార్కెట్లోకి కొత్త ఎయిర్ కూలర్లు.. బుధవారమిక్కడ ఎనర్జీ ఇఫీషియన్సీ ఇన్వెర్టర్ ఎయిర్ కూలర్లను ప్రవేశపెట్టిన సందర్భంగా హోమ్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్ సలీల్ కపూర్‌తో కలిసి రాకేష్ ఖన్నా విలేకరులతో మాట్లాడారు. ఈసీఎం టెక్నాలజీతో నడిచే ఈ కూలర్లతో 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. ఐవోటీ ఆధారిత ఈ ఎయిర్ కూలర్లను స్మార్ట్‌ఫోన్ లేదా అలెక్సాతో నియంత్రణ చేసుకోవచ్చు. 8 లీటర్ల నుంచి 105 లీటర్ల వరకు 54 రకాల ఎయిర్ కూలర్లున్నాయి. వీటి ధరల శ్రేణి రూ.5,190 నుంచి రూ.19,900 మధ్య ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 25 శాతం మార్కెట్ వాటా.. దేశవ్యాప్తంగా ఏటా 29 లక్షల ఓరియంట్ ఎలక్ట్రిక్ ఎయిర్ కూలర్లు విక్రయమవుతుంటే.. ఇందులో 4.7 లక్షల యూనిట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే జరుగుతున్నాయి. ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు, గృహోపకరణాలు అన్ని కలిపి ఏపీ, తెలంగాణలో 18–19 శాతం మార్కెట్ వాటా ఉందని, రెండేళ్లలో 25 శాతం మార్కెట్ వాటాను లకి‡్ష్యంచామన్నారు. ఓరియంట్ ఎలక్ట్రిక్ నుంచి లైటింగ్, హోమ్ అప్లయెన్సెస్, స్విచ్ గేర్స్ వంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి. 450 నగరాల్లో సుమారు 4 వేల మంది డీలర్లు, 1.25 లక్షల రిటైల్ ఔట్‌లెట్లున్నాయి. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లను తెరవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరు, ఎన్సీఆర్, చండీఘడ్ నగరాల్లో మాత్రమే ఉన్నాయి. -
భారీ డిస్కౌంట్లకు ఇదే చివరి అవకాశం
న్యూఢిల్లీ : ఈ పండగ కాకపోతే.. వచ్చే పండగ. లేదా ఆ తర్వాత ఫెస్టివల్‌కు చూసుకోవచ్చులే. ఏదైనా కొత్త వస్తువు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చులే, డిస్కౌంట్లు ఎలాగో ప్రతి పండగకు ఉంటాయిలే అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లియెన్స్, స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందడానికి ఇదే చివరి అవకాశమట. వచ్చే దివాళి సేల్ అనంతరం, ఈ వస్తువులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లు పొందాలంటే కాస్త కష్టతరమేనట. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈ వస్తువులపై కస్టమ్ సుంకాన్ని పెంచింది. ఈ సుంక పెంపు నేపథ్యంలో వచ్చే పండగ సీజన్ తర్వాత వీటిపై ధరలు పెంచాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. షావోమి, హానర్, వన్‌ప్లస్, శాంసంగ్, ఆసుస్ వంటి స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఈ పండగ సీజన్ వరకు ఎలాంటి ధరలు పెంచకూడదని నిర్ణయించి, ఆ తర్వాత నుంచి ధరల పెంపు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే వైట్ గూడ్స్ తయారీదారులు పానాసోనిక్, బోస్, బీఎస్‌హెచ్ ఎలక్ట్రానిక్స్ కూడా పండగ సీజన్ వరకు ధరలు పెంచకూడదని నిర్ణయించాయి. రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో, కరెంట్ అకౌంట్ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పెంచింది. సరిగ్గా పండగ సీజన్‌కు ముందు ఈ ప్రకటన చేయడంతో, ఈ సారి డిస్కౌంట్లు ఉంటాయో ఉండవోనని వినియోగదారులు తెగ ఆందోళన చెందారు. కానీ ఈ పండగ సీజన్ వరకు ధరలు పెంచకుండా ఉండేందుకు కంపెనీల వద్ద ఇన్వెంటరీ ఉందని, ఈ పండగ సీజన్ అయిపోయిన వెంటనే కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ‘రూపాయి క్షీణత నిజంగా పెద్ద తలనొప్పి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్ ధరలు 10 శాతం వరకు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ధరలు పెంచకూడదని నిర్ణయించాం. అంతేకాక సేల్స్ వాల్యుమ్ పెంచేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నాం’ అని హువావే, హానర్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పీ సంజీవ్ తెలిపారు. వెంటనే ధరల పెంపు చేపట్టి, వినియోగదారులపై భారం వేయకుండా.. ఈ ఏడాది ముగింపు నాటికి ధరలను పునఃసమీక్షిస్తామని వన్‌ప్లస్, షావోమి తెలిపాయి. ఈ పండగ సీజన్ వరకు అయితే డిస్కౌంట్లను, ఆఫర్లను కొనసాగిస్తామని పేర్కొన్నాయి. -
పాత ధరల్లోనే గ్యాడ్జెట్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్
ఢిల్లీ : దేశమంతా ఒకే పన్ను విధానం జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేసింది. జూలై 1 నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చినప్పటికీ, చాలామంది చిన్న మొబైల్ రిటైలర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు ఇంకా ప్రీ-జీఎస్టీ ధరల్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. పాత ఇన్వెంటరీని క్లియర్ చేసుకునేందుకు లేదా కొత్త పన్ను విధానంలోకి మారేందుకు సన్నద్ధంగా లేకపోవడంతో ఈ రిటైలర్లు బ్యాక్‌డేటెడ్ బిల్లుల ద్వారా వీటిని విక్రయిస్తున్నట్టు తెలిసింది. జీఎస్టీ రేట్లతో కొత్త స్టాక్ వచ్చేంతవరకు అంటే వచ్చే రెండు మూడు రోజుల వరకు ఈ బ్యాక్‌డేటెడ్ బిల్లింగ్ ద్వారానే రిటైలర్లు విక్రయాలు చేపడతారని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రి అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లో గందరగోళ వాతావరణం ఏర్పడిందని, కొత్త పన్ను విధానంలోకి మారడానికి అందరూ రిటైలర్లు సిద్ధంగా లేరని ఓ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీదారి సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. సాఫ్ట్వేర్ అప్డేట్ను బిల్లింగ్ సిస్టమ్స్ చేయాల్సి ఉందని, దానికి మరికొంత సమయం పడుతుందన్నారు. అంతేకాక ఎవరైతే పాత స్టాక్‌ను ఎక్కువగా కలిగిఉన్నారో వారికి కూడా నష్టాలు వస్తున్నాయని చెప్పారు. కేవలం 30-60 రోజలు స్టాక్‌కు మాత్రమే పరిహారం ఇవ్వడానికి కంపెనీలు సిద్దమవుతున్నాయని తెలిపారు. జీఎస్టీ అమలుతో చాలా ఉత్పత్తులపై ధరలు పెరిగాయి. ధరలు పెరుగుతాయనే భయాందోళనతో చాలామంది వినియోగదారులు కూడా ముందస్తుగానే ఉత్పత్తులను కొనుగోళ్లు చేశారు. దీంతో శనివారం నుంచి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ స్టోర్లు బోసిపోయాయి. జీఎస్టీతో పన్ను రేట్లు పెరుగడంతో ఈ నెల ప్రారంభం నుంచి తమ విక్రయాలు 60 శాతం పైగా పడిపోయాయని జువెల్లరీ వర్తకులు చెప్పారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండీషనర్ల షాపులదే ఇదే పరిస్థితి. వీటిపై పన్ను రేట్లు 26 శాతం నుంచి 28 శాతానికి పెరిగాయి. దీంతో బ్యాక్‌డేటెడ్ బిల్లుతో రిటైలర్లు విక్రయాలు చేపడుతున్నారు.