న్యూఢిల్లీ: పండుగల విక్రయాలు జోరుగా సాగాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అంచనాలను మించి అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రీమియం (ఖరీదైన), మధ్య శ్రేణి ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు విక్రయాలకు అడ్డుపడకపోవడం వాటిని ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ ఏడాది పండుగల సీజన్‌లో విక్రయాలు విలువ పరంగా 30 శాతం, సంఖ్యా పరంగా 20 శాతం వృద్ధిని చూసినట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రకటించింది.
‘‘ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మంచిగా సాగాయి. మధ్యశ్రేణి నుంచి ఖరీదైన ఉత్పత్తుల వరకే చూస్తే అమ్మకాల్లో 30 శాతం, విలువలో 40–50 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా పండుగల చివరి మూడు రోజుల్లో ఎక్కువ డిమాండ్ కనిపించింది’’అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. కానీ, ఆరంభ ధరల్లోని ఉత్పత్తుల అమ్మకాలు ఈ పండుగల సీజన్‌లో 10–15 శాతం తగ్గినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒత్తిళ్లు ఒక కారణం అయితే, కొందరు వినియోగదారులు ఆరంభ స్థాయి నుంచి తదుపరి గ్రేడ్ ఉత్పత్తులకు మారిపోవడం మరో కారణమని వివరించారు.
ఖరీదైన వాటికి ఆదరణ..
ఖరీదైన గృహోపకరణాలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్యానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా ఎండీ ఫుమియసు ఫుజిమోరి తెలిపారు. ఈ పండుగ సీజన్‌లో ఏసీలు, పెద్ద తెరల టీవీలు, హోమ్ అప్లయన్సెస్ విక్రయాలు డబులు డిజిట్‌లో పెరుగుతాయన్న అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ‘‘విలువ పరంగా చూస్తే ఇన్వెస్టర్ ఏసీల అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదైంది. ఎల్‌ఈడీ టీవీల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. 4కే టీవీల అమ్మకాల్లో అయితే ఏకగా 34 శాతం వృద్ధి కనిపించింది. టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్లలో 13 శాతం అధిక వృద్ధి నమోదైంది’’అని ఫుజిమోరి వివరించారు. విద్యుత్‌ను ఆదా చేసే ఏసీలు, వినియోగం సులభంగా ఉండే ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ వృద్ధి ఇలాగే స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
సెప్టెంబర్ త్రైమాసికంలో అధిక వృద్ధి
ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హెచ్‌యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా స్పందిస్తూ.. సెప్టెంబర్ త్రైమాసికంలో విక్రయాలు ఇటీవలి కాలంలోనే ఎక్కువగా నమోదైనట్టు చెప్పారు. దీపావళి తర్వాత విక్రయాల తీరును కూడా గమనించాల్సి ఉంటుందన్నారు. తక్కువ ధరల వాటితో పోలిస్తే ప్రీమియం ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు పాపులర్ బ్రాండ్ల కంటే మించి ఉన్నాయి. అలాగే, చౌక ఉత్పత్తులతో పోలిస్తే పాపులర్ ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి’’అని సంజీవ్ మెహతా వివరించారు. ప్రీమియం విభాగంలో వృద్ధి ఎక్కువగా ఉండడం ప్రజల వద్ద ఖర్చు పెట్టే ఆదాయం పెరిగిందనడానికి సూచనగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment