సాక్షి, బెంగళూరు: ప్రస్తుతం దేశంలో ఆధార్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. పుట్టినప్పటి నుంచి పెన్షన్ వరకూ ప్రతి దానికీ ఆధార్ అనుసంధానమే. తాజాగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ) త్వరలోనే ‘ఆధార్’తో ప్రయాణికులకు ప్రవేశం కల్పించనుంది. 2018 డిసెంబర్ నాటికి కేఐఏ పూర్తి స్థాయిలో ఆధార్, బయోమెట్రిక్‌లతో ప్రయాణికులకు ప్రవేశం కల్పించే విధంగా మారనుంది.
తద్వారా దేశంలోనే మొట్టమొదటి ఆధార్ ఆధారిత ఎయిర్‌పోర్ట్‌గా ఇదే కానుంది. ఆధార్ ద్వారా ప్రయాణికులకు ప్రవేశాన్ని కల్పించడం వల్ల వారు ప్రతి చెక్ పాయింట్‌లోనూ తమ గుర్తింపు కార్డులను చూపాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు బయోమెట్రిక్ ద్వారా ప్రయాణికులు ప్రవేశిస్తారు కాబట్టి సెక్యూరిటీలో కూడా ప్రయాణికులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేదని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సెక్యూరిటీ ప్రక్రియను పూర్తి చేసేందుకు 25 నిమిషాలు పడుతుంటే, కొత్త విధానం వచ్చాక ఇది పది నిమిషాలకే పరిమితమవుతుంది.
ఎయిర్‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి మరార్ దీనిపై మాట్లాడుతూ....‘ఆధార్, బయోమెట్రిక్‌ల వల్ల భద్రత కట్టుదిట్టమవుతుంది. తనిఖీలకు చాలాసేపు క్యూలలో నిలబడాల్సిన పని ఉండదు. అందువల్ల ప్రయాణికులు మరింత ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని ఆస్వాదించగలరు. డిసెంబర్ 2018 నాటికి
ఈ విధానం అమల్లోకి రానుంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment