న్యూఢిల్లీ: ఆన్‌లైన్ రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో.. ఇదే రంగంలోని మరో ప్రముఖ సంస్థ ఉబెర్‌ఈట్స్‌ను కైవసం చేసుకునే దిశగా పావులుకదుపుతోంది. ఉబెర్‌ఈట్స్‌ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీల నుంచి పోటీ పెరిగిన నేపథ్యంలో తాజాగా ఈ సంస్థ 500 మిలియన్ డాలర్లను ఆస్క్ ప్రైస్‌గా కోట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, జొమాటో ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జొమాటోలో చైనా చెల్లింపుల సంస్థ యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడులు ఉన్నాయి.
‘షేర్ల జారీ మార్గంలో కొనుగోలు పూర్తిచేసేందుకు జొమాటో చర్చలు కొనసాగిస్తుంది. అయితే, ఎంత మొత్తం అనే విషయంలో కాస్త అటుఇటుగా ఉన్నప్పటికీ... చర్చల్లో పురోగతి ఉందని మాత్రం కచ్చితంగా చెప్పగలం’ అని ఈ డీల్‌తో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఉబెర్‌ఈట్స్ మాతృసంస్థ, ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్... డీల్ పూర్తయిన తరువాత జొమాటోలో 500–600 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై తాము వ్యాఖ్యానించబోమని ఉబెర్ పేర్కొంది. ఇక మరో సంస్థ స్విగ్గీ కూడా ఉబెర్‌ఈట్స్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
2020లో రూ.1,451 కోట్ల నష్టాలు
భారత్‌లో ఉబెర్‌ఈట్స్ 2020 అంచనా నష్టం రూ.1,451 కోట్ల వరకు ఉండవచ్చని ఉబెర్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఈట్స్ కారణంగా ఐపీఓ లిస్టింగ్‌లో భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. లిస్టింగ్ ధర నుంచి 33 శాతం పతనమైంది. ఇక్కడి మార్కెట్‌లో 3వ స్థానంలో ఉన్న ఈ సంస్థను విక్రయించడం ద్వారా నష్టాల నుంచి బయటపడేందుకు ఉబెర్ ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment