మృతి చెందిన మల్లేష్
రంగారెడ్డి, శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : సరదాగా కబడ్డీ ఆడుతుండగా ఇద్దరు బాలుర మధ్య చెలరేగిన వివాదం ఓ బాలుడి మృతికి దారితీసింది. శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన మీసాల నర్సింహ, జయమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు శిరీష పాలెంలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి, రెండో కూతురు స్వాతిముత్యం గౌలిదొడ్డి సమీపంలోని నవోదయ పాఠశాలలో 9వ తరగతి, కొడుకు మల్లేష్(12) పాల్మాకులలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నారు. వీరి ఇంటి పక్కన ఉండే ఓ బాలుడు శంషాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఉండడంతో తోటి బాలురతో పాటు మల్లేష్, మరో విద్యార్థి స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కబడ్డీ ఆడుతున్న క్రమంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది.
దీంతో అతడు మల్లేష్‌ను కొట్టాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన మల్లేష్‌ను సదరు బాలుడు అక్కడికి వెళ్లి మరోసారి చేతితో కొట్టాడు. స్పృహ తప్పి కింద పడిపోవడంతో మల్లేష్‌ను కుటుంబ సభ్యులు శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మల్లేష్ చనిపోయినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ అహ్మద్‌పాషా తెలిపారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవని, మెడ కింద చేతి గోరు గీసుకున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
గ్రామంలో విషాదం..
కాలక్షేపం కోసం ఆడిన ఆట ప్రాణం మీదకు తేవడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చదువులో చురుకుగా ఉండే మల్లేష్ మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.