చికిత్సపొందుతున్న రాణి
సిద్దిపేటటౌన్: సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో ప్రేమికుడు ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన సోమవారం రాత్రి కలకలం సృష్టించింది. ప్రేమికుడు కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగగా.. అతడిని కాపాడబోయిన ప్రేమికురాలు అస్వస్థతకు గురై సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించి పోలీసులు, ఇరువురి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెజ్జంకి మండలం రేగులపల్లికి చెందిన సంతోష్‌రెడ్డి(28) అదే గ్రామానికి చెందిన బోనగిరి రాణి(28) చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలో గ్రామంలో చాలాసార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ సైతం జరిగింది. రాణికి గతంలోనే పెళ్లి జరగగా.. విడాకులు తీసుకుని ఇంటి వద్దే ఉంటోంది. సంతోష్‌రెడ్డికి ఇటీవలే గ్రామంలోని మరో యువతితో వివాహం నిశ్చయమైంది. ఆ వివాహం చేసుకోవడం సంతోష్‌రెడ్డికి ఇష్టం లేకపోవడంతో శనివారం రాణితో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే పెళ్లి చేసుకుని ఏదైనా పని చేసుకుంటూ జీవిస్తామని తెలిసిన వారికి చెప్పి వెళ్లాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చి పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో బస్సు దిగి అక్కడే చాలా సేపు వేచి ఉన్నారు. అంతకుముందే సంతోష్‌రెడ్డి తన వెంట పురుగుల మందు తెచ్చుకున్నాడు. బాత్రూంకు వెళ్లోస్తానని రాణికి చెప్పి సంతోష్‌రెడ్డి బస్టాండ్‌లో ఉన్న బాత్రూంలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందు కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగాడు. కాసేపటికి నోట్లో నుంచి నురగలు కక్కుతూ బయటకు వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు కేకలు వేయడంతో సంతోష్‌రెడ్డి పడిపోయిన చోటుకు వచ్చిన రాణి అతడి నోట్లో నుంచి వస్తున్న నురగను తీసేస్తూ నోటితో శ్వాస అందించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో విష ప్రభావానికి గురైన రాణి కాసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రేమికుల జంటను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ఆస్పత్రికి తీసుకువెళ్లిన 5 నిమిషాల్లోపే సంతోష్‌రెడ్డి మృతిచెందాడు. రాణి కోమాలోకి వెళ్లి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఇదిలా ఉంటే ఇద్దరూ విషం తాగి ఆత్మహత్య యత్నం చేసుకోవడంలో తమకు ఎవరి పైనా అనుమానం లేదని, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తమకు తెలియవని ఇరువురి కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పెళ్లి ఇష్టం లేదని సూసైడ్ లెటర్
సంతోష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ లెటర్ రాసినట్టు తెలిసింది. అందులో తనకు పెళ్లి నిశ్చయమైన అమ్మాయి అంటే ఇష్టం లేదని, ఇక తాను బతకనని పేర్కొంటూ అమ్మ, నాన్న క్షమించాలని రాసినట్టు తెలిసింది. తన తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోవడమే అని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుంటే తాను బతకలేను అనే విషయం తెలియక ఇంట్లో వారు తనకు వేరే అమ్మాయితో పెళ్లికి నిశ్చయించడమే ఆత్మహత్యకు కారణంగా లేఖను బట్టి తెలుస్తోంది. మృతుడు సంతోష్‌రెడ్డి రాసిన లేఖను 108 సిబ్బంది తీసుకుని పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి పోలీసులు ఈ లేఖ విషయం ఎందుకు దాచి పెట్టారో అర్థం కాని విషయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment