ఇంఫాల్: దేశంలో మూక హత్యలు ఆగడం లేదు. తాజగా మణిపూర్‌లో చోటుచేసుకున్న మూకహత్య ఆ ప్రాంతంలో మతఘర్షణలకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. తౌబాల్ జిల్లాలో లిలాంగ్‌కు చెందిన 26 ఏళ్ల ఫరూఖ్ ఖాన్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. ఫరూఖ్ ప్రయాణిస్తున్న వాహనం గురువారం తెల్లవారుజామున పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని థరోజమ్ గ్రామానికి చేరుకోంది. అయితే ఫరూఖ్‌ను, అతని స్నేహితులను వాహనాల దొంగలుగా భావించిన ఆ గ్రామ ప్రజలు వారిపై దాడికి దిగారు. అంతేకాకుండా వారి కారును కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఫరూఖ్‌తో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకోగా.. తీవ్రంగా గాయపడిన ఫరూఖ్ మృతి చెందాడు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు మూకహత్యతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు.
కాగా, ఈ ఘటనలో అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని థరోజమ్ గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. వారు స్టేషన్‌పై రాళ్లు విసరడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మరోవైపు ఫరూఖ్ అతని స్నేహితులు వాహనాన్ని దొంగతనం చేసేందుకు ప్రయత్నించడంతోనే తాము దాడికి దిగినట్టు ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనతో సంబంధం ఉన్న పదమూడు మందిని గుర్తించామని, మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. థరోజమ్ గ్రామస్తుల వాదనను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు.
ఫరూఖ్ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాట్లాడుతూ.. ఫరూఖ్ చాలా అమాయకుడినని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన మణిపూర్ మానవ హక్కుల సంఘం.. సెప్టెంబర్ 22లోపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర డీజేపీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment