సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో పట్టపగలు దారిదోపిడీ చోటు చేసుకుంది. దుండగులు నడిరోడ్డుపై ఓ యువకుడిని కత్తులతో బెదిరించి వాహనం, సెల్‌ఫోన్లు, పర్సు లాక్కెళ్లారు. ఈ విషయం ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. బేగంపేట శ్యామ్‌లాల్ ప్రాంతానికి చెందిన రాజబోయిన యాదగిరి బంజారాహిల్స్ రోడ్ నం.12లోని బాలాజీ డిస్ట్రిబ్యూటర్స్ కార్యాలయంలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు.
బుధవారం ఉదయం సహోద్యోగి రాజేంద్ర మిశ్రాతో కలసి బైక్‌పై జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని సాగర్ సిమెంట్స్ కార్యాలయానికి వచ్చాడు. యాదగిరి తన బైక్‌ను రోడ్డుకు ఎడమ వైపు నిలిపి ఉంచాడు. కుడివైపునున్న సాగర్ సిమెంట్స్ కార్యాలయంలోకి రాజేంద్ర మిశ్రా వెళ్లాడు. ఇంతలో హఠాత్తుగా ముగ్గురు వ్యక్తులు వచ్చి యాదగిరిని కత్తులతో బెదిరించి బైక్‌పై నుంచి కిందకు తోసేశారు. అతడి వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లు, పర్సును లాక్కుని, బైక్‌తో పారిపోయారు. తేరుకున్న యాదగిరి వారిని వెంబడించడానికి ప్రయత్నించినా ఫలితంలేకపోయింది.
ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. యాదగిరి మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దుండగులు పారిపోయిన మార్గాల్లోని సీసీ కెమెరాలను అదనపు ఇన్‌స్పెక్టర్ కె.ముత్తు పరిశీలించారు. దుండగులు పంజగుట్ట మీదుగా బేగంపేట ఫ్లైఓవర్ వరకు వెళ్లినట్లు గుర్తించారు. బేగంపేట ప్రాంతానికి చెందిన వారే ఈ దోపిడీకి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం శాంతిభద్రతల విభాగంతోపాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment