సొంతూరులో దొర.. హైదరాబాద్‌లో దొంగ  | Thief in Hyderabad and Aristocrat in home town | Sakshi
Sakshi News home page

సొంతూరులో దొర.. హైదరాబాద్‌లో దొంగ 

Published Fri, Feb 15 2019 3:14 AM | Last Updated on Fri, Feb 15 2019 5:26 AM

Thief in Hyderabad and Aristocrat in home town - Sakshi

చోరీ సొత్తును పరిశీలిస్తున్న సీపీ సజ్జనార్, ఇతర పోలీసు అ«ధికారులు (ఇన్‌సెట్లో) కాశీనాథ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘తెల్లటి ఖద్దర్‌ చొక్కా...చేతికి రెండు ఉంగరాలు...ఆపై బుల్లెట్‌ బైక్‌పై జర్నీ.. ఇదీ ఓ చోరశిఖామణి ఆహార్యం. రైతు సంఘానికి అధ్యక్షుడిగా, సొంతూరులో పెద్దమనిషిగా చలామణి అవుతూ, హైదరాబాద్‌లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేస్తున్న గుల్బర్గా జిల్లా బెలూర్గికి చెందిన కాశీనాథ్‌ గైక్వాడ్‌ ని తొలిసారిగా సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 54 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావుతో కలిసి పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం మీడియాకు వెల్లడించారు.  

పెద్దమనిషి హోదా తగ్గకుండా.. 
కాశీనాథ్‌ గైక్వాడ్‌ అఫ్జల్‌పూర్‌ తాలూకా రైతు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ గ్రామంలో రాజకీయంగా చురుగ్గా ఉంటున్నాడు. అదే సమయంలో పైరవీలు చేస్తూ అందరి దృష్టిలో పెద్దమనిషిగా చలామణి అవుతున్నాడు. ఈ రాజకీయాల్లో తిరుగుతుండగానే లగ్జరీ లైఫ్‌ స్టైల్‌కు అలవాటు పడటంతోపాటు పేకాటకు వ్యసనపరుడయ్యాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఊర్లో తన హోదా తగ్గకుండా ఉండేందుకు చోరీలను ఎంచుకున్నాడు. ఇందుకు హైదరాబాద్‌ను ఎంచుకొని గతేడాది అక్టోబర్‌ ఏడు నుంచి ఈ ఏడాది జనవరి 22 వరకు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 16 ఇళ్లలో చోరీలు చేసి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు.  

తాళం వేసిఉన్న ఇళ్లే లక్ష్యం.. 
కాశీనాథ్‌ దొంగతనం చేయాలనుకున్నప్పుడు వెంట సెల్‌ఫోన్‌ తెచ్చుకునేవాడు కాదు. గుల్బర్గా నుంచి బస్సులో హైదరాబాద్‌కు చేరుకొని ఆటోల్లో కాలనీల్లో ప్రయాణిస్తూ తాళం వేసిఉన్న ఇళ్లను గమనించేవాడు. కొన్ని సందర్భాల్లో నడుస్తూనే ఎవరూ లేని ఇళ్లపై కన్నేసేవాడు. వెంటనే అక్కడికి సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఉండే ఇనుప పరికరాలతో తాళాలను పగులగొట్టేవాడు. ఆయా ఇళ్లలో లభించిన బంగారు, వెండి ఆభరణాలను గుల్బర్గాకు తీసుకెళ్లి అఫ్జల్‌పూర్‌లోని కళాసింగ్‌కు ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. ఇలా సైబరాబాద్, రాచకొండలో 16 దొంగతనాలు చేసి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేయడంతో సీపీ సజ్జనార్‌ మార్గదర్శనంలో క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా పర్యవేక్షణలో బాలానగర్, మాదాపూర్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.శ్రీనివాస్, చంద్రబాబు నేతృత్వంలో బృందాన్ని రంగంలోకి దింపారు.  

సీసీటీవీకి దొరికినా.. 
మియాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, ఉప్పల్, బాచుపల్లి ఠాణా పరిధిలో దొంగతనాలు జరిగిన సమయంలో సీసీటీవీ ఫుటేజీలను ఈ ప్రత్యేక బృందం సేకరించింది. అన్నింటిని జాగ్రత్తగా గమనించగా కాశీనాథ్‌ అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుగా గుర్తించారు. అయితే గతంలో ఎటువంటి ప్రాపర్టీ నేరాల్లో గైక్వాడ్‌ అరెస్టు కాకపోవడంతో అతన్ని పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. గతంలో అఫ్జల్‌పూర్‌ ఠాణా పరిధిలో ఓ పెట్టీ కేసులో మాత్రమే గుల్బర్గా జైలుకు వెళ్లి వచ్చాడు. దీంతో గైక్వాడ్‌ను పట్టుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బృందం వెళ్లింది. చివరకు గుల్బర్గా పోలీసులను సంప్రదించడంతో గైక్వాడ్‌ను బుధవారం పట్టుకొని ట్రాన్సిట్‌ వారంట్‌పై గురువారం సిటీకి తీసుకొచ్చారు. కోర్టులో హజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement