భారతీయ సంతతికి చెందిన వైద్యుడుకి జైలు శిక్ష
న్యూయార్క్ : బాలికకు మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడుతూ... ఆ దృశ్యాలను ఫొటో తీస్తున్న భారతీయ సంతతికి చెందిన వైద్యుడికి యూఎస్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి.... భారతీయ సంతతికి చెందిన వైద్యుడు రాకేష్ పన్ను (57) చిన్న పిల్లల వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి వద్దకు చికిత్స కోసం వచ్చే చిన్నారులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని మాయ మాటలు చెప్పి... వారి తల్లిదండ్రులను బయటే ఉంచి... గదిలో బాలికకు మత్తు మందు ఇచ్చి... లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆపై ఆ దృశ్యాలను ఫొటో తీసేవాడు.
ఆ విషయాన్ని ఓ బాలిక తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో 2010లో రాకేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులోభాగంగా రాకేష్ నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో యూఎస్ కోర్టు అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.