ఎన్నారై డాక్టర్ కు 8 ఏళ్ల జైలు
లండన్: మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎన్నారై వైద్యుడు జైలు పాలయ్యాడు. బ్రిటన్ లో గైనకాలిస్ట్ గా పనిచేస్తున్న మహేశ్ పటవర్థన్ కు వూల్ విచ్ క్రౌన్ కోర్టు ఎనిమిదేళ్ల కోర్టు జైలు శిక్ష విధించింది. తీర్పు వెలువరించినప్పుడు అతడి భార్య, కుమారుడు, కుమార్తె.. కోర్టులోనే ఉన్నారు.
వూల్ విచ్ లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రి, లూయిస్ హామ్ లోని బ్లాక్ హీత్ ఆస్పత్రిలో పటవర్థన్ పనిచేశాడు. 2008, జూలై 31- 2012, సెప్టెంబర్ 24 మధ్యకాలంలో పలువురు మహిళా రోగులను అతడు లైంగిక వేధింపులకు గురిచేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. డాక్టర్ పటవర్థన్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత మహిళ ఒకరు కోర్టుకు తెలిపింది. తనపై వచ్చిన ఆరోపణలను పటవర్థన్ తోసిపుచ్చాడు. కాగా, జనరల్ మెడికల్ అసోసియేషన్(జీఎంసీ) అతడి సభ్యత్వాన్ని రద్దు చేసింది.