కాన్సాస్‌లో తెలుగు వైద్యుడి హత్య | Nalgonda doctor stabbed to death in Wichita | Sakshi
Sakshi News home page

కాన్సాస్‌లో తెలుగు వైద్యుడి హత్య

Published Fri, Sep 15 2017 1:25 AM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

డాక్టర్‌ అచ్యుతా రెడ్డి(ఫైల్‌ ఫోటో)

డాక్టర్‌ అచ్యుతా రెడ్డి(ఫైల్‌ ఫోటో)

- కత్తితో పలుమార్లు పొడిచిన రోగి..
- అక్కడికక్కడే చనిపోయిన అచ్యుత్‌ రెడ్డి
- పోలీసుల అదుపులో నిందితుడు
- అచ్యుత్‌ స్వస్థలం మిర్యాలగూడ
- పాతికేళ్లుగా అమెరికాలోనే ప్రాక్టీస్‌


మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎన్నారై మానసిక వైద్య నిపుణుడు నాగిరెడ్డి అచ్యుత్‌రెడ్డి (57) అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. కాన్సస్‌ రాష్ట్రం ఈస్ట్‌ విచిత పట్టణంలో సెంట్రల్‌ ఎడ్జ్‌మూర్‌ వద్ద ఆయన నిర్వహిస్తున్న హోలిస్టిక్‌ సైకియాట్రిక్‌ క్లినిక్‌ సమీపంలోనే భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. పలుమార్లు కత్తిపోట్లకు గురై అచ్యుత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అచ్యుత్‌రెడ్డి వద్ద చికిత్స పొందుతున్న ఉమర్‌ రషీద్‌ దత్‌ (21) అనే రోగి ఈ హత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని పార్కింగ్‌ వెనక భాగంలో పోలీసులు గుర్తించారు. దత్‌ను విచిత కంట్రీ క్లబ్‌ సమీపంలో అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు అధికారి లెఫ్టినెంట్‌ టాడ్‌ ఒజిల్‌ తెలిపారు. ‘‘దత్‌ కొంతకాలంగా అచ్యుత్‌రెడ్డి వద్ద వైద్యం చేయించుకుంటున్నట్టు తెలిసింది.

హత్యకు ముందు వారిద్దరూ కలిసే క్లినిక్‌ భవనంలోకి వెళ్లారు. తర్వాత దత్‌ బయటికొచ్చి, ఆ వెంటనే మళ్లీ లోనికి వెళ్లాడు. అచ్యుత్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా దత్‌ ఆయనను వెంబడించి కత్తితో పలుమార్లు పొడిచాడు’’ అని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ ఒజిల్‌ చెప్పారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అచ్యుత్‌రెడ్డి తల్లిదండ్రులు నాగిరెడ్డి భద్రారెడ్డి, పారిజాత మిర్యాలగూడలోని సీతారాంపురంలో ఉంటున్నారు. కుమారుని మరణ వార్త తెలిసి వారు కుప్పకూలిపోయారు. గురువారం ఉదయమే తమకు ఈ దుర్వార్త తెలిసిందంటూ భద్రారెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. అచ్యుత్‌రెడ్డి కుటుంబసభ్యులు, బంధువులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.

పాతికేళ్ల క్రితమే అమెరికాకు
అచ్యుత్‌రెడ్డి నల్లగొండ పట్టణంలోనే పాఠశాల విద్య అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1986లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తర్వాత అమెరికా వెళ్లి విచితలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సాస్‌ మెడికల్‌ స్కూల్‌ నుంచి సైకియాట్రీలో రెసిడెన్సీ పూర్తి చేశారు. అనంతరం 1989 నుంచి అక్కడే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. విచితలో హోలిస్టిక్‌ సైకియాట్రిక్‌ సర్వీసెస్‌ను నిర్వహిస్తూనే పలు స్థానిక ఆస్పత్రుల్లో కన్సల్టెంట్‌గా కూడా కొనసాగుతున్నారు. ఆయన భార్య బీనా అనస్తీషియా స్పెషలిస్టు. వారికి ఇద్దరు కూతుళ్లు రాధ, లక్ష్మి, కుమారుడు విష్ణు ఉన్నారు. అచ్యుత్‌రెడ్డి ఏటా మిర్యాలగూడ వచ్చి నెల పాటు తల్లిదండ్రుల వద్ద ఉండేవారు. 2017 జనవరిలో కూడా వచ్చి మూడు వారాలు ఉండి వెళ్లారు.