ఇండియానా రాష్ట్రంలోని ఎల్హర్ట్ నగరంలో ఇద్దరు సిక్కులు దారుణ హత్యకు గురైన సంఘటన అమెరికాలోని భారతీయ సిక్కు సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. ఎన్నారైలు జగత్తర్ సింగ్ భట్ట్ (55), పవన్ ప్రీత్ సింగ్ (20)ల హత్యను ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) కార్యనిర్వహాక డైరెక్టర్ సత్నం సింగ్ చహల్ తీవ్రంగా శనివారం ఇక్కడ ఖండించారు.
దేశంలోని సిక్కులు అభద్రతభావం, భయం నీడన జీవించాల్సిన పరిస్థితి వారి హత్య ద్వారా రుజువు అయిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని సిక్కుల మతస్థులు, వారి ఆస్తుల రక్షణకు కల్పించేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని సత్నం సింగ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు లేఖ రాశారు.
నగరంలోని జగత్తర్ సింగ్కు చెందిన కిరాణ దుకాణం వద్ద గతరాత్రి సిక్కులు పెద్ద సంఖ్యలో హాజరై వారికి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఈసందర్బంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరు ఆ కార్యక్రమానికి హాజరై కొవ్వోత్తులు, దీపాలు వెలిగించి ఆ ఇద్దరు మృతులకు శాంతి కలగాలని వారు ఆకాంక్షించారు.
ఇండియానా రాష్ట్రంలోని ఎల్హర్ట్ నగరంలో ఎన్నారై జగత్తర్ సింగ్ భట్ట్ చెందిన కిరాణ దుకాణంలోకి గురువారం మాస్క్లు ధరించిన ఇద్దరు ఆగంతకులు ప్రవేశించారు. ఆ దుకాణం యజమాని ఎన్నారై జగత్తర్ సింగ్ భట్ట్తోపాటు అక్కడ పని చేస్తున్న పవన్ ప్రీత్ సింగ్లపై కాల్పులు జరిపారు. దాంతో వారు అక్కడికక్కడే మరణించారు.
స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆ క్రమంలో ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలతో కెవిన్ మూర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.మరో నిందితుని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో ప్రీత్ నగర్ జగత్తర్ సింగ్ స్వస్థలమని, అలాగే పవన్ ప్రీత్ హోషియార్పూర్లోని మున్నన్ గ్రామమని పోలీసులు తెలిపారు.