108 సేవలు అమోఘం
హాలియా : ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లి వారి ప్రాణాలను కాపాడుతున్న అపరసంజీవని (108అంబులెన్స్ వాహనం) కృష్ణాపుష్కర భక్తులకు అందించిన సేవలు అమోఘమనే చెప్పవచ్చు. భక్తుల సౌకర్యార్థం నాగార్జునసాగర్ శివాలయం ఘాట్ వద్ద ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన 108 అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ 12 రోజులుగా ఈ వాహనం ద్వారా దాదాపు 200లకుపైగా భక్తులు సేవలందించారు. అత్యవసర చికిత్స నిమిత్తం సాగర్ కమలానెహ్రూ ఆసుపత్రితోపాటు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భక్తుల ప్రాణాలు కాపాడి శభాష్ 108 అనిపించుకుంది. వాహనసిబ్బంది కూడా మానవతా దృక్పథంలో సేవలందించి ఆత్మసంతృప్తిని పొందుతున్నారు.
పుష్కర భక్తులకు సేవలందించడం అదృష్టం– తుమ్మ జగదీశ్, 108 ఉద్యోగి, కొణిజెర్ల ఖమ్మం జిల్లా
కృష్ణాపుష్కరాలకు వచ్చే భక్తులకు వైద్య సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నా. 12ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ సందర్భంగా భక్తులకు సేవలు చేయడం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. భక్తులతోపాటు ఉద్యోగులకు కూడా అత్యవసర సేవలు అందించాం.
ఇదో మధుర జ్ఞాపకం – ఎం.వెంకటేశ్వర్‌రావు, 108 పైలట్
పుష్కరభక్తులకు సేవలందించడం ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది. పన్నెండేళ్ల పండగను గుర్తుంచుకునేలా భక్తులకు సేవలందించే బాధ్యత అప్పగించడం సంతోషంగా ఉంది. ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడకు వచ్చి సేవలందించడం మహాభాగ్యమే.