
అదుపుతప్పి 108 వాహనం బోల్తా
వేంపల్లె: వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి చెందిన 108 వాహనం మంగళవారం అలిరెడ్డిపల్లె రహదారిలో పాపాఘ్ని నది వంతెన వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తు అందులో ఉన్న గర్భిణి, ఆమె బంధువులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితుల కథనం మేరకు అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బడుగు రవి భార్య కుమారి పురిటి నొప్పులతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం 108 వాహనానికి సమాచారం అందించగా అక్కడికి చేరుకుంది. గర్భిణి కుమారితోపాటు ఆమె తల్లి పార్వతమ్మ ఆశా వర్కర్ మహేశ్వరి, బంధువు రాజమ్మలు ఆ వాహనంలో వేంపల్లెకు బయలుదేరారు. పాపాఘ్ని నదిలో ఇటీవల తాత్కాలిక వంతెన నిర్మించారు. అక్కడ స్కూటర్ అడ్డు వచ్చిందని.. పెద్ద రాయిని తప్పించబోయి అదుపు తప్పిందని డ్రైవర్ శ్రీనివాసులు తెలిపాడు. అయితే బాధితులు మాత్రం డ్రైవర్ వాహనాన్ని అంతకు మునుపు 5నిమిషాలు నిలబెట్టి ఫోన్‌లో మాట్లాడాడని.. మళ్లీ ఫోన్ వదలకుండా మాట్లాడుతూనే వాహనాన్ని నడపడంతో అదుపు తప్పిందని చెబుతున్నారు. అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి తన బొలేరో వాహనంలో గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. గర్భిణి ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది.