వ్యవసాయానికి 11 గంటల విద్యుత్
వ్యవసాయానికి 11 గంటల విద్యుత్
Published Sun, Aug 21 2016 8:01 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
నల్లజర్ల : మెట్ట ప్రాంతంలో వర్షాలు లేక ఎండిపోతున్న వరి పంటను రక్షించేందుకు 11 గంటల వ్యవసాయ విద్యుత్‌ను అందించేందుకు కలెక్టర్ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారని వ్యవసాయశాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి తెలిపారు. ఈ విధానం సోమవారం నుంచే అమలు కానుందన్నారు. ఆదివారం ఆమె పోతవరం, అనుమనిలంక, సుబధ్రపాలెం గ్రామాల్లో నీరందక ఎండిపోతున్న వరి పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోపాలపురం నుంచి కొయ్యలగూడెం మీదుగా పోతవరం వచ్చే తాడిపూడి లిఫ్ట్–3 ద్వారా పూర్తి స్థాయిలో నీరందించేలా సంబంధిత అధికారులతో మాట్లాడారు.
మెట్ట ప్రాంతంలో ఎక్కడైనా పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంటే సంబంధిత వ్యవసాయాధికారి దృష్టికి తీసుకువచ్చి అక్కడ ఉన్న నీటి వనరులను సద్వినియోగపర్చుకోవాలన్నారు. వ్యవసాయశాఖ ద్వారా ఆయిల్ ఇంజిన్లు, రెయిన్ గన్స్, స్పింక్లర్లు యుద్ధప్రాతిపదిక అందించనున్నట్టు చెప్పారు. నల్లజర్ల మండలంలో 20 రెయిన్‌గన్స్ అందుబాటులో ఉంచుతున్నామని అత్యవసరమనుకున్న వారు వాటిని తీసుకెళ్లి వినియోగించుకోవచ్చని చెప్పారు. మండలంలో 500 హెక్టార్లలో వరి ఎండిపోయే పరిస్థితి ఉందని, దాంట్లో 300 హెక్టార్లు తాడిపూడి కాలువ కిందే ఉందన్నారు. వ్యవసాయ విద్యుత్ పెంచడం, తాడిపూడి కాలువ ద్వారా సత్వరం నీరందితే ఈ పంటను దక్కించుకోగలుగుతామన్నారు. ఆమె వెంట ఏవో సోమశేఖరం, ఎంపీఈవో యజ్ఞ శ్రీలత, రైతులు కానూరి వెంకటరత్నం,కరుటూరి రామకృష్ణ,పెండ్యాల గిరి, ప్రత్తిపాటి వెంకటేశ్వరావు పాల్గొన్నారు.
Advertisement